హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరాశా నిసృ్పహలతోనే కొడంగల్ సభలో కేసీఆర్, కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది ఆయన రాజకీయ దిగజారుడు తననానికి నిదర్శనమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. సాగునీరు, సంక్షేమం, మౌలిక వసతుల్లో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ పాలనపై మాట్లాడే నైతిక అర్హత సీఎం రేవంత్‌రెడ్డికి లేదని పేర్కొన్నారు. కేసీఆర్ పాలమూరు ప్రాంతాన్ని పడావుపెట్టారన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని మండిపడ్డారు. పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలోనే సింహభాగం పూర్తయ్యాయని వివరించారు. తెలంగాణ ఏర్పడక ముందు పాలమూరు ప్రజల కష్టా లు, వలసలకు పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దేనని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లా డే ముందు కాంగ్రెస్ పాలనలో సాగునీటి పరిస్థితేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని దుయ్యబట్టారు.
కేసీఆర్‌ను భయపెట్టగలమనేది భ్రమ
బీఆర్ఎస్ నాయకత్వాన్ని, కేసీఆర్‌ను బెదిరింపులతో భయపెట్టగలమని అనుకోవడం సీఎం రేవంత్‌రెడ్డి భ్రమేనని ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. రేవంత్ పాలనపై ప్రజలు విసుగు చెందారని, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు బండకేసి బాదాలా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు.
అసెంబ్లీలో వాస్తవాలు మాట్లాడాలి
సీఎం రేవంత్‌రెడ్డి నిజంగా చర్చకు సిద్ధమైతే అసెంబ్లీలో వాస్తవాలు మాట్లాడాలని, వ్యక్తిగత దూషణలు, బెదిరింపుల భాష మానుకోవాలని ప్రశాంత్‌రెడ్డి హితవు చెప్పా రు. ప్రతిపక్ష సభ్యులకు తగిన సమయం ఇవ్వాలని, అప్పుడే సాగునీటి రంగంలో తెలంగాణకు ఎవరు ఏం చేశారో, చర్చించి తేల్చుకుందామని సవాల్ చేశారు.