Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : వారంతా కొత్త టీచర్లు! భావితరాలకు బంగారు బాటలు వేయాల్సిన వారు! వారి ముందు నాలుగు మంచి మాటలు చెప్తే గుర్తుంచుకుంటారు! వీలైతే జీవితాంతం ఆచరిస్తారు! అలాంటి వారి ముందు మాట్లాడేటప్పుడు బాధ్యతతో వ్యవహరించాలి. కానీ ఇందుకు భిన్నంగా సీఎం రేవంత్రెడ్డి తిట్ల దండకాన్ని అందుకున్నారు. కొరివి దయ్యమంటూ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తూ టీచర్ల ముందే బూతుపురాణం వల్లించారు. ‘చప్పట్లు కొడితే గుండె పల్గాలె’ అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులను పార్టీ కార్యకర్తల్లా భావించి పిలుపునిచ్చారు.
డీఎస్సీ-2024లో ఉద్యోగాలు పొందిన టీచర్లకు ఎల్బీ స్టేడియంలో బుధవారం నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సభలో మాట్లాడారు. సీఎం ప్రసంగం కోసం కొత్త టీచర్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో మైకు అందుకున్న రేవంత్, కొరివి దయ్యమంటూ ఆక్షేపణీయ వ్యాఖ్యతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నాలుగు మంచిమాటలతో స్ఫూర్తి నింపాల్సింది పోయి, సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన టీచర్ల మొదల్లో విషాన్ని నింపే ప్రయత్నం చేశారు. రాజకీయ విమర్శలతో సభను పూర్తిగా రాజకీయ పార్టీ కార్యక్రమంలా మార్చారు. గతంలోనూ ‘బొందపెట్టి’, ‘కాళ్లకు తాడు కట్టి బజార్ల ఈడ్చుకెళ్లాలె’, ‘మగతనం’, ‘అచ్చోసిన అంబోతు’, ‘పేగులు మెడలో’, ‘లాగుల తొండలు’ అంటూ మాటలు జారారు. ఇలా రోజురోజుకూ సీఎం బూతుపురాణం మితిమీరుతుండటంపై రాజకీయ విశ్లేషకులు సైతం విస్తుపోతున్నారు. ఆయన భాషను మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు.