CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ప్రజాప్రతినిధులు పదవుల కోసమే పార్టీలు మారుతున్నారంటూ పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలతో సంబం ధం లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు రచించిన ‘ఉనిక’ పుస్తకాన్ని హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఆదివా రం ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భం గా సీఎం మాట్లాడుతూ… ‘నేను ఫిరాయింపులపై మాట్లాడితే బాగుండదు. అయినా మాట్లాడాల్సి వస్తున్నది. విద్యార్థి రాజకీయాల్లో సైద్ధాంతిక క్రియాశీలత లో పించినందునే ఇలాంటి నాయకత్వం త యారవుతున్నది. పదవుల కోసం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి మారుతున్నరు’ అని వ్యాఖ్యానించారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ పోటీ పడేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో కాదని.. న్యూ యార్క్, టోక్యోలతో అని సీఎం రేవంత్‌రె డ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మూ డుసార్లు బీజేపీ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన విద్యాసాగర్‌రావును అలా పిలిస్తే తనకు దూరమనుకుంటారని, అందుకే ఆయనను సాగర్జీ అని సంబోధిస్తున్నానని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణకు గోదావరి జలాలు తెచ్చేందుకు మొదట విద్యాసాగర్‌రావు, దేవేందర్‌గౌడ్ పాదయాత్ర చేశారని, ఆ తర్వాతే రాజశేఖర్‌రెడ్డి ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారని చెప్పారు. గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు సాగర్జీ సహకారం కావాలని కోరారు. తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో విస్తరణ, గ్రీన్‌ఫీల్డ్ హైవే, డ్రైపోర్ట్, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్ర మంత్రి బండి సంజ య్ సహకరించాలని విన్నవించారు. ఇం దుకు బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ముందుకురావాలని కోరారు.
ప్రభుత్వమంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాదు..
ప్రభుత్వమంటే కాంగ్రెస్‌కు చెందిన 65 మంది ఎమ్మెల్యేలే కాదు.. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా కలిస్తేనే ప్రభుత్వమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడం ప్రతిపక్షం బాధ్యత అని చెప్పారు. హైదరాబాద్‌లో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి మేఘా సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని, రాష్ర్టాభివృద్ధికి బీజేపీ నాయకుల సహకారం తీసుకుంటానని చెప్పారు.