సుల్తాన్ బజార్/హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఐటీఐ(ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)లను అధునాతన సాంకేతిక కేంద్రాలు(ఏటీసీ)గా అభివృద్ధి చేయనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఐటీఐల్లో ఇప్పటికీ నాలుగైదు దశాబ్దాల నాటి నైపుణ్యాలనే బోధిస్తున్నారని, ప్రస్తుత అవసరాలకు అవి ఉపయోగం లేకుండా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను యువతకు అందించటమే లక్ష్యంగా ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో మంగళవారం సీఎం సిల్ డెవలప్మెంట్ అప్‌గ్రేడేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ట్రేడ్ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలు నిరుపయోగంగా మారాయని, ఐటీఐల్లో నేర్పించే నైపుణ్యాలు విద్యార్థులకు ఉపయోగం లేకుండా పోయాయని అన్నారు.
40- 50 ఏండ్ల కిందటి నైపుణ్యాలను ఐటీఐల్లో నేర్పిస్తున్నారని చెప్పారు. అందుకే తన సొంత ఆలోచనల నుంచి వచ్చినవే ఏటీసీ సెంటర్లు అని చెప్పారు. 40 లక్షల మంది యువత ఉపాధి లేక రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూ తిరుగుతున్నారని, ఉద్యోగం సాధించేందుకు సర్టిఫికెట్ ఉంటే సరిపోదని, సాంకేతిక నైపుణ్యం తప్పనిసరి అని చెప్పారు. టాటా సంస్థ సహకారంతో సాంకేతిక నైపుణ్యాల కోసం రూ.2,324 కోట్లతో 65 ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని తెలిపారు. విద్యార్థుల శిక్షణ కోసం ముందుకొచ్చిన టాటా యాజమాన్యానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులు ఐటీఐల్లో చేరాలని, ఈ శాఖ తన దగ్గరే ఉంటుందని, తానే పర్యవేక్షిస్తానని, వీటి పనితీరుపై ప్రతి నెల సమీక్ష నిర్వహిస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నింటినీ వరుసగా రద్దు చేస్తూ వస్తున్న కాంగ్రెస్ సర్కారు… యథావిధిగా న్యాక్ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను కూడా రద్దు చేసింది. వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించేందుకు ఉద్దేశించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్ఏసీ)ను మరింత అభివృద్ధి చేయడంతోపాటు అన్ని జిల్లాల్లో న్యాక్ అనుబంధ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.
ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో రూ.10కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను మంజూరు చేసింది. వీటి నిర్మాణ పనులు కూడామొదలయ్యాయి. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వీటికి మంజూరు చేసిన నిధులను రద్దుచేసింది. రాష్ట్రం నుంచి దేశవిదేశాలకు వెళ్తున్న వివిధ వృత్తిపనివాళ్లకు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి నైపుణ్యాలను బోధించేందుకు ఉద్దేశించిన ఈ కేంద్రాలను రద్దు చేయొద్దని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా కోరినా ఫలితం లేకుండా పోయింది.