CM Revanth | ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వాసం కల్పించే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో మంగళవారం మంత్రులతో మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అన్ని శాఖల కార్యదర్శులతో కలిసి కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలంగాణలో పది జిల్లాలుండేవని.. ఆ సమయంలో ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా నడిపించారన్నారు. అప్పటితో పోలిస్తే జిల్లాల పరిధి, జనాభా సంఖ్య తగ్గిందన్నారు. అప్పటితో పోలిస్తే కలెక్టర్ల అధికారాలు, బాధ్యతల్లో తేడా ఏమీ లేదన్నారు. అప్పుడు పది మంది చేసిన పనిని ఇప్పుడు 33 మంది కలెక్టర్లు కలిసికట్టుగా ఎందుకు చేయలేరని ప్రశ్నించారు.
ఎవరికివారు ఆలోచనలు, పనితీరును సమర్థతను చాటుకోవాలన్నారు. ఇది ప్రజా ప్రభుతమని.. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలతో ప్రజలకు విశ్వాసం కల్పించే బాధ్యత మీనని కలెక్టర్లకు సీఎం మార్గదర్శనం చేశారు. కలెక్టరేట్లలో ప్రతివారం నిర్వహించే ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో సమస్యలు పరిష్కారమైతే, హైదరాబాద్‌లో ప్రజాభవన్‌కు వచ్చే అర్జీల సంఖ్య తగ్గిపోతుందని.. అదే మీ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు. ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలను రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలనేది ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని గృహ జ్యోతి, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకాలకు అర్హులెవరికైనా ఈ పథకం వర్తించకపోతే.. తమ ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్ సర్వీస్ నంబర్లు సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని సీఎం గుర్తు చేశారు. అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రజా పాలన సేవా కేంద్రాలు పని చేసేలా చూడాలని, అవసరమైతే ప్రజావాణి జరిగే రోజున కలెక్టరేట్లలోనూ సేవాకేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు 15లోగా పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది సభ్యులున్నారని, కోటి మందిని సభ్యులుగా చేరేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీరిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం ప్రకటించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ భూములు, చెరువులుల, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని సూచించారు. అవసరమైతే జియో ట్యాగింగ్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేసి ప్రభుత్వ భూములపై నిఘా ఉంచాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని నిర్ణయించారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని ఆదేశించారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వైద్య సేవలందించే ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందని, అధ్యయనం చేసి అందుకు సంబందించిన ఉత్తర్వులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు.