LRS | హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిండుకున్న ఖజానా నింపుకోవడానికి రేవంత్రెడ్డి సర్కారు పడరాని పాట్లు పడుతున్నది. ఆరు గ్యారెంటీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ అనివార్యమైంది. ఇందుకోసం ఆదాయ మార్గాలపై అన్వేషణ ప్రారంభించింది. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేసిన ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి మళ్లీ అదే ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ను తెరపైకి తెచ్చారు.
మార్కెట్ ధరలపై 14శాతం ఎల్ఆర్ఎస్ చార్జీలు వసూలు చేయాలని భావించింది. ఎల్ఆర్ఎస్ పరిష్కారం ద్వారా దాదాపు రూ.10 వేల కోట్లకు పైగానే ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సర్కారు సంకల్పించింది. మున్సిపాలిటీ పరిధిలోనే దాదాపు రూ.7000 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ల్యాండ్ రెగ్యులరైజేషన్ కోసం 2020లో స్వీకరించిన మొత్తం 25.70 లక్షల దరఖాస్తులను ఒక్కొక్కటిగా క్లియర్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 3 నెలల క్రితమే జీవో జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు కష్టపడి పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా టార్గెట్లను నిర్ణయించారు. ఇతర పనులు పక్కన పెట్టి ఆదాయం వచ్చే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. దీంతో మున్సిపల్ అధికారులు ప్రతి రోజు అదే పనిలో నిమగ్నంకానున్నారు.
129 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు కలిపి మొత్తం 142 మున్సిపాలిటీ పరిధిలో ఎల్ఆర్ఎస్ త్వరితగతిన పరిష్కరించాలని కంకణం కట్టుకున్నారు. ఆ మేరకు చార్జీలు వసూలు చేయాలని ఉన్నతాధికారులు ప్రతి రోజు ఫాలో అప్ చేస్తున్నారు. ఒక పక్క కులగణన సర్వే కార్యక్రమంలో మున్సిపల్ కమిషన్లు, అధికారులు, సిబ్బంది మొత్తం నిమగ్నమయ్యారు. మరో పక్క ఎల్ఆర్ఎస్ను పరిష్కరించాలని అదే ప్రభుత్వం ఆ శాఖ అధికారులపై ఒత్తిడి పెంచారు. మధ్యలో తాము నలిగిపోతున్నాయని ఆ శాఖ అధికారులు, సిబ్బంది ప్రభుత్వ విధానాలపై అసహనం వ్యక్తంచేస్తున్నారు.