హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిలో వైద్యారోగ్య శాఖ విఫలమైందని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా వైద్యశాఖ ఉన్నతాధికారుల పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తుగా కార్యాచరణ రూపొందించుకొని ఎందుకు అమలు చేయలేకపోయారని రేవంత్‌రెడ్డితోపాటు వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. వేలాదిగా కేసులు నమోదువుతుండ టం, విషజ్వరాలు ప్రబలుతున్నా వైద్యసిబ్బందిలో ఇంకా అలసత్వం కనిపిస్తున్నదని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇకపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినట్టు తెలుస్తున్నది. దోమల నియంత్రణకు చర్యలు చేపట్టలేకపోయిన పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలపైనా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కనీసం ఫాగింగ్ కూడా చేయకపోవడం ఏమిటని మండిపడినట్టు తెలిసింది. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ముందస్తు ప్రణాళిక అమలు చేయకపోవడం వల్లే రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రభలుతున్నాయని ఆగ్ర హం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
డెంగ్యూ కట్టడికి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల కట్టడిపై సచివాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ డెంగ్యూ కట్టడిపై రాష్ట్రస్థాయిలో డీపీహెచ్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి డీపీహెచ్ రవీందర్ నాయక్ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పదోన్నతులకు సంబంధించి మంగళవారం డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీని (డీపీసీ) నియమించారు. ఈ మేరకు శాఖ ముఖ్య కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాశ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సీఐజీ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనుండగా, ఎక్సైజ్ శాఖ కమిషనర్, రెవెన్యూ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ -2, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-1కు పదోన్నతి పొందే అర్హుతల జాబితాను తయారు చేయనున్నారు.
తొర్రూరు/నర్సంపేట, ఆగస్టు 27: విషజ్వరాలతో ఇద్దరు మరణించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెంకటాపురం గ్రామ శివారు కేవ్లాతండాలో బానోత్ లచ్చిరాం(54) కొన్ని రోజులుగా తరచూ జ్వరం బారిన పడుతున్నాడు. మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. కాగా వరంగల్ జిల్లా నర్సంపేటలో సంకినేని అర్జున్ (17) కొద్ది రోజుల క్రితం జ్వరం వచ్చింది. రోజురోజుకు జ్వర తీవ్రత పెరిగిపోయింది. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు.