హైదరాబాద్, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత రాజశేఖర్‌రెడ్డి పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేవి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. ఈ పథకాలన్నింటికీ గాంధీల పేర్లే ఉండేవి. తద్వారా అధిష్ఠానాన్ని మచ్చిక చేసుకునేవారు. ఫలితంగా రాష్ట్రంలో తనకు అడ్డులేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నాణేనికి ఇది రెండోవైపు.
రాజశేఖర్‌రెడ్డి బలమైన నేత కావడం, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నంత అసమ్మతి లేకపోవడంతో ఆయన పదవీకాలం సాఫీగా సాగిపోయింది. నిత్యం గాంధీల జపం చేయడం ద్వారా అటు పార్టీలోనూ, ఇటు ప్ర భుత్వంలోనూ తాను అనుకున్న పనులను నిర్విఘ్నంగా చేసుకుంటూ పోయేవారు. చూ స్తుంటే తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా వైఎస్ అడుగు జాడల్లోనే నడుస్తున్నట్టు గా అనిపిస్తున్నది. అవే ఎత్తుగడలను పాటిస్తూ పథకాలకు గాంధీ కుటుంబ పేర్లు పెట్టడం.
బహిరంగ సభల్లో వీలు చిక్కినప్పుడల్లా గాంధీలను ఆకాశానికి ఎత్తడం ద్వారా అధిష్ఠానం పెద్దలకు దగ్గర కావాలని, తద్వారా రాష్ట్రంలో తనకు ఎదురులేకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. తాజాగా, సచివాలయం ఎదురుగా మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా అందులో భాగమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఎస్‌కు ఎదురు నిలిచే నేతలు లేకపోవడం, ఆయ నే సీనియర్ కావడం కలిసొచ్చింది. కానీ, ప్రస్తుతం విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నా యి. రేవంత్ పరిస్థితి దినదినగండం నూరేండ్ల ఆయుష్షులా తయారైంది. రేవంత్ ఎప్పుడు దొరుకుతాడా? ఎప్పుడు సీటును తన్నుకుపోదామా? అని సీనియర్లు ఎదురుచూస్తున్నారు.
వైఎస్ బాటనే రేవంత్ అనుసరిస్తున్నప్పటికీ ఇద్దరికీ ఏమాత్రం పోలికలేదు. వైఎస్సార్ జీవితాంతం కాంగ్రెస్‌తోనే ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ, రేవంత్‌రెడ్డి పరిస్థితి వేరు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి అనూహ్యంగా సీఎం పదవిని చేజిక్కించుకున్నారు. సీనియర్లకు అధిష్ఠానం ఈ విషయం లో మొండిచేయి చూపింది. ఇది సీనియర్లకు కంటగింపుగా మారింది. మరోవైపు, రేవంత్ తీరుపై అధిష్ఠానం కూడా గుర్రుగా ఉంది. ప్రభుత్వ పరంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అధిష్ఠానానికి మింగుడుపడటం లేదు.
ఆయన ఏ క్షణంలోనైనా పార్టీని ముంచి పోతారన్న అనుమానం పార్టీ పెద్దలను వెంటాడుతున్నది. అందుకే ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్ణ యం తీసుకున్నా తమకు చెప్పేచేయాలని అధిష్ఠానం షరతు విధించినట్టు తెలిసింది. దీనికితోడు రేవంత్‌రెడ్డితో నేరుగా భేటీ అయేందుకు పార్టీ పెద్దలు ఉత్సాహం చూపడం లేదు. ఆయనతోపాటు మరెవరైనా ఉంటేనే భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. గాంధీలకు తనపై విశ్వాసం లేదన్న విషయం తెలిసే రేవంత్ ఇలా గాంధీల నామస్మరణ చేస్తూ దగ్గర కావాలన్న ప్రయత్నా లు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.