హైదరాబాద్, అక్టోబర్20 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జి చేయడంతోపాటు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఇది కాంగ్రెస్ దురహంకారానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు అశోక్‌నగర్ వెళ్లిన రేవంత్‌రెడ్డి ఇప్పుడెందుకు వెళ్లరని నిలదీశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కాకముందు అశోక్‌నగర్ లైబ్రరీకి వెళ్లి అనేక కబుర్లు చెప్పి, ఇప్పుడేమో ఏకంగా లాఠీచార్జీకి దిగుతారా? అని ఆరోపించారు. అభ్యర్థులతో ఒకసారి చర్చిస్తే పోయేదేముందని నిలదీశారు. ఉద్యోగాలను భర్తీచేసే చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగులు, విద్యార్థులతో మాట్లాడాలని, ధైర్యం లేకపోతే పోలీసులను వెంట బెట్టుకొని అశోక్‌నగర్ వెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కనీస ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నదని, వికీపీడియా, గూగూల్ ఆధారంగా పరీక్షలు రాయమంటారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధర్నాలు, నిరసనలు చేసే హకులేదా? అని ప్రశ్నించారు. ముత్యాలమ్మ ఆలయ ధ్వంసం విషయంపై హిందూ సంఘాలపై పోలీసుల దౌర్జన్య కాండను కిషన్‌రెడ్డి ఖండించారు. సీఎం రేవంత్ హిందూ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపించారు.