హైదరాబాద్, ఆగస్టు16 (నమస్తే తెలంగాణ): వరంగల్ వేదికగా ఈ నెల 24న రైతు కృతజ్ఞత సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నది. ఆ సభకు రావాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించినట్టు తెలుస్తున్నది.
సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి మల్లికార్జున ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయి ఇదే అంశంపై చర్చించినట్టు తెలుస్తున్నది. మరోవైపు, సచివాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని రాజీవ్‌గాంధీ జయంతి రోజు 20వ తేదీన ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి కూడా పార్టీ పెద్దలను ఆహ్వానించినట్టు తెలిసింది.
సీఎం రేవంత్‌రెడ్డి తాజా పర్యటనతో ఇప్పటికీ 19సార్లు ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ పెద్దలను సైతం కలిశారు. మల్లికార్జున ఖర్గేతో దాదాపు గంటా 20 నిమిషాలపాటు చర్చించారు. క్యాబినెట్ విస్తరణ, పలు కార్పొరేషన్లు, నామినెటెడ్ పోస్టులు, టీపీసీసీ అధ్యక్షుడి నియామకంపై చర్చించినట్టు తెలిసింది. అయితే, వాటిపై అధిష్ఠానానికి, రేవంత్‌రెడ్డి ప్రతిపాదనలకు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం.
దీంతో ఆయా అంశాలపై ఎటువంటి పురోగతి లేకుండానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఇటీవల తెలంగాణ నుంచి రాజ్యసభకు పార్టీ అభ్యర్థిగా ఎంపికైన అభిషేక్ మను సింఘ్వి ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్పీ) ఆదివారం ప్రత్యేకంగా భేటీ కానున్నది. ఇందులో రాజ్యసభ ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక ఎన్నికలపై చర్చించనున్నారు. రుణమాఫీపై వాడవాడలా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే నిర్ణయించారు. ఆయా అంశాలపై సీఎల్పీ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారని తెలిసింది.