దేవరుప్పుల, డిసెంబర్ 15 : హైదరాబాద్లోని కోకాపేటలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని శనివారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించగా, తమను ఆహ్వానించకపోవడంపై కడవెండిలోని ఆయన వారసులు ఆవేదన వ్యక్తంచేశారు. దొడ్డి కొమురయ్య స్వస్థలం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామం. ఇక్కడ ఆయన వారసులు ఉన్నారు. రాష్ట్ర స్థ్ధాయిలో పెట్టిన కురుమ సంఘానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టి కనీసం ఆయన వారసులుగా తమను ఈ ప్రారంభ కార్యక్రమానికి పిలువకపోవడం అవమానంగా భావిస్తున్నామని కొమురయ్య అన్న కుమారుడు దొడ్డి భిక్షపతి, మనుమడు దొడ్డి చంద్రం తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరులో తమ కుటుంబం నుంచి ముగ్గురిని కోల్పోయినట్టు చెప్పారు. సాయుధ పోరులో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఖ్యాతి ఖండాంతరాలకు పాకిందని, రష్యాలో ఓ వీధికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టిన విషయాన్ని వారు గుర్తుచేసుకున్నారు. సొంత రాష్ట్రంలో నిర్మించిన ఈ కురుమ భవనానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టినందుకు గర్వంగా భావించామని, అయితే అదే భవన ప్రారంభానికి తమకు ప్రభుత్వ పక్షాన ఆహ్వానం అందకపోడంపై ఒకింత ఆశ్చర్యానికి గురైనట్టు తెలిపారు. నాడు దొరల పాలనలో వివక్షకు గురైన తాము నేడు పాలకుల వివక్షకు గురైనట్టు భావిస్తున్నామని వాపోయారు.