T-Hub | హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషితో ఏర్పాటుచేసిన టీ-హబ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసలు కురిపించారు. స్టార్టప్‌ల పెట్టుబడులకు టీ-హబ్ దేశంలోనే అత్యుత్తమ పాలసీగా ఉందని కొనియాడారు. ఎవరైనా సరే వచ్చి తెలంగాణలో స్టార్టప్ పెట్టుబడులు పెట్టొచ్చని సూచించారు. ఢిల్లీలో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం నిర్వహించిన అడ్డా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్ఠానంపై, పార్టీ అనుసరిస్తున్న విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఫార్మాట్‌ను మార్చుకోవాలని సూచించారు. టీ-20 మ్యాచ్ ఆడాల్సిన సమయంలో కాంగ్రెస్ నాయకులు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఒకవిధంగా కాంగ్రెస్ జాతీయ విధానాన్ని తప్పుపట్టేలా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హైదరాబాద్‌ను న్యూయార్క్, సియో ల్, టోక్యోగా మారుస్తానని, అభివృద్ధిలో పక్క రాష్ర్టాలతో కాకుండా తన పోటీ ప్రపంచదేశాలతోనేనని పునరుద్ఘాటించారు. ఓవైపు అదానీని, కార్పొరేట్లను విమర్శిస్తూ మరోవైపు తెలంగాణలో పెట్టుబడులకు వారినే ఆహ్వానిస్తుండడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారనే ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ.. మిగిలిన కార్పొరేట్లకు ఏ విధమైన ప్రాధాన్యం ఇస్తున్నానో అదానీకి కూడా అదే ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పారు. అదానీ పెట్టుబడులు పెడతా అంటే తాను నిరాకరించబోనని అన్నారు. ఫోర్త్‌సిటీ, మూసీ పునరుజ్జీవనం, ట్రిపుల్ఆర్, రేడియల్ రోడ్స్ నిర్మా ణం తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లని తెలిపారు. వచ్చే పదేండ్లు అధికారంలో ఉంటానని, ఈ ప్రాజెక్టులను పూర్తిచేస్తానని చెప్పారు. పదేండ్ల తర్వా త ఢిల్లీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పడం గమనార్హం.