హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): త్వరలో నిర్మించనున్న ఫోర్త్‌సిటీలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లస్థలాలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇండ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు. అర్హులైన వారిని ఫ్యూచర్‌సిటీలో భాగస్వాములను చేస్తామని చెప్పారు. ఆదివారం ఆయన రవీంద్రభారతిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (జేఎన్‌జేహెచ్‌ఎస్)కు భూమి స్వాధీన పత్రాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొ న్నం ప్రభాకర్‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భం గా సీఎం మాట్లాడుతూ.. జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు అనే భావనతో వారి సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇండ్ల స్థలాలు కేటాయించారని గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఆ స్థలాలను తమ చేతుల మీదుగా అందజేయడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. అర్హులైన మిగిలిన జ ర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు తగిన నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి శశభిషలూ లేవని తెలిపారు.
వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరని, తమ కు తామే పెంచుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్బోధించారు. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తున్నదని, అలాంటి వారిని నియంత్రించే బాధ్యత జర్నలిస్టులపైనే ఉన్నదని వ్యాఖ్యానించారు.
ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడిటేషన్, ఇతర సమస్యలకు శాశ్వత పరిషారం చూపేందుకు మీడియా అకాడమీ కొత్త విధివిధానాలను రూపొందించాలని సీఎం సూచించారు. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.10 కోట్లు ఇస్తున్న ట్టు సీఎం ప్రకటించారు. ఫోర్త్‌సిటీ, ఫ్యూచర్‌సిటీ నిర్మాణంలో భాగస్వాములమవుదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చనిపోయి న 41 మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెకును సీఎం అం దజేశారు. అనంతరం జేఎన్జేహెచ్ఎస్కు పేట్‌బషీర్‌బాగ్‌లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో కేటాయించిన 38 ఎకరాల భూమి స్వాధీనపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ పాల్గొన్నారు.