హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారుచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణపై బుధవా రం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రేటర్లో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం సూచించారు. మూడు నెలల్లోగా తగితనంతమంది హోంగార్డులను నియమించుకోవాలని ఆదేశించారు. అప్పటి వరకు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న హోంగార్డులను ట్రాఫిక్ విభాగానికి రప్పించాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో శాంతిభద్రతల విభాగం పోలీసులను కూడా గ్రేటర్లో ట్రాఫిక్ కంట్రోల్‌కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
ప్రతి జంక్షన్లో పోలీసులు ఉండాల్సిందే
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయిని పెంచాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అందుకు సరిపడా సిబ్బంది నియామకాలు చేపడతామని సీఎం తెలిపారు. ఆటోమెటిక్ సిగ్నలింగ్‌పై ఆధారపడకుండా ప్రతి జంక్షన్లో పోలీసులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మల్టీలెవల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, సీఎం ముఖ్యకార్యదర్శి శేషాద్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్, సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీం, అడిషనల్ డీజీ (ఇంటెలిజెన్స్) శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
Traffic Review
బీఎఫ్ఎస్ఐ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) కన్సార్షియం ప్రతినిధులు బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ శిక్షణ, నైపుణ్యాభివృద్ధి అత్యంత కీలకమని, తమ ప్రభుత్వం వీటికి అత్యంత ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్, బిజినెస్ రంగాల్లో సాంకేతిక నిపుణుల తయారీకి కన్సార్షియం కీలక పాత్ర పోషించాలని తెలిపారు.