CM Revanth Reddy | హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): “థియేటర్లో ఒక తల్లి చనిపోయినా కూడా మానవత్వం లేకుండా రూఫ్‌టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయిన ఆ హీరో ఏం మనిషి..? మృత్యువుతో పోరాడుతున్న బాలుడిని ఆ హీరోనే కాదు.. సినీప్రముఖులు కూడా పరామర్శించలేదు. అంటూ సినీప్రముఖులపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను సీఎంగా ఉన్నంతకాలం సినిమావాళ్ల ఆటలు సాగవనివ్వనని స్పష్టంచేశారు. అసెంబ్లీలో రైతుభరోసా చర్చ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనను ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ప్రస్తావించారు. ఒవైసీకి రేవంత్‌రెడ్డి సమాధానం చెబుతూ అల్లు అర్జున్, సినీప్రముఖులను తప్పుబట్టారు.
పర్మిషన్ కుదరదని ముందే చెప్పారు!
పుష్ప 2 బెనిఫిట్ షోకు హీరో వస్తున్నారని సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులను కోరిందని, ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదని సీఎం తెలిపారు. పోలీసుల సూచనలను పట్టించుకోకుండా అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారని, రోడ్ షో నిర్వహించారని మండిపడ్డారు. థియేటర్ గేట్లను తెరవడంతో అభిమానులు, హీరో బౌన్సర్ల మధ్య తోపులాట జరిగిందని వివరించారు. రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు శ్రీతేజ్ నలిగిపోయారని తెలిపారు. అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లిన తర్వాత స్పృహతప్పిన రేవతి, శ్రీతేజ్‌ను గుర్తించిన పోలీసులు పీసీఆర్ చేసి, దవాఖానకు తరలించారని చెప్పారు. అప్పటికే రేవతి మృతి చెందిందని, శ్రీతేజ్ బ్రెయిన్ డెడ్ అయ్యాడని రేవంత్‌రెడ్డి తెలిపారు.
వెళ్లాలని చెప్పినా వినని హీరో!
అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లి బాల్కనీలో కూర్చున్నారని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పేందుకు థియేటర్ నిర్వాహకులు వెళ్లగా బౌన్సర్లు అడ్డుకున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. సినిమా చూసి వెళ్తానని అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా బదులిచ్చారని విమర్శించారు. మహిళ మృతి విషయాన్ని చెప్పి, వెళ్లకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించడంతో అల్లు అర్జున్ వెళ్లిపోయారని సీఎం తెలిపారు. మానవత్వం లేకుండా చేతులు ఊపుకుంటూ హీరో వెళ్లిపోయారని ఆరోపించారు. ఆ హీరో ఏం మనిషి? అని విరుచుకుపడ్డారు. పోలీసులు కేసు పెట్టారని, విచారణ కోసం ఇంటికి వెళ్లిన పోలీసులతో అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించడంతో అరెస్ట్ చేశారని వెల్లడించారు. హైకోర్టు వెంటనే విచారణ జరిపి, బెయిల్ మంజూరు చేసిందని, అర్ధరాత్రి అని చూడకుండా విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసిందని రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తంచేశారు. అర్ధరాత్రి జైలు తలుపులు తెరవాలంటే తాను ఎలా తెరుస్తామని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ అరెస్టును కొందరు రాజకీయం చేస్తున్నారని, సినీ, రాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా చేస్తారా? అని ప్రశ్నించారు.
అసలు ఏం అనుకుంటున్నారో!
అల్లు అర్జున్ అరెస్టుపై మాట్లాడుతూనే సినీప్రముఖులపైనా సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. సీనిప్రముఖులు కూడా ఏం అనుకుంటున్నారో తెలియడంలేదని ధ్వజమెత్తారు. తొక్కిసలాటలో మహిళ చనిపోగా, ఆమె కుమారుడు కోమాలో ఉంటే ఆ కుటుంబాన్ని సినిమా ప్రముఖులు ఎవరూ పరామర్శించలేదని మండిపడ్డారు. జైలుకు వెళ్లొచ్చిన అల్లు అర్జున్ను పరామర్శించడంపైనా విమర్శించారు. ఆ హీరోకు కన్నుపోయిందా? కాలు విరిగిందా? అని నిప్పులు చెరిగారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నరో తెలియడంలేదని అసహనం వ్యక్తంచేశారు.
ఇకపై బెన్ఫిట్ షోలు ఉండవు: కోమటిరెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కిమ్స్‌లో బాధిత కుటుంబానికి తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ప్రతీక్ ఫౌండేషన్ నుంచి రూ.25 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. వైద్యఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో బెన్ఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని ప్రకటించారు. ఆ తర్వాత కిమ్స్‌కు వెళ్లి శ్రీతేజ్ తండ్రికి రూ.25లక్షల చెకును అందించి, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ పుష్ప2 సినిమా తాను కూడా చూశానని, మూడున్నర గంటల టైమ్ వేస్ట్ అయిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి సినిమా చూసి యువకులు చెడిపోతున్నారని మండిపడ్డారు. ఇకపై తాను దేవుళ్లు, చరిత్ర, తెలంగాణ ఉద్యమ నేపథ్యం కలిగిన చిత్రాలను మాత్రమే చూస్తానని స్పష్టంచేశారు.