హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆ మేరకు ఢిల్లీలో కాకుండా, గల్లీలో పోరాటాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానం శాస్త్రీయంగా లేదని, అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన సలహాలు, సూచనలను రేవంత్రెడ్డి సర్కార్ పెడచెవున పెట్టిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నంలో లోపాలు తలెత్తడం వల్లే తెలంగాణ హైకోర్టు స్టే విధించిందని తెలిపారు. సర్కారు అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాల వల్లే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫోస్టోలో ఇచ్చిన హామీల అమలుపై తూతూ మంత్రంగా వ్యవహరిస్తూ, చేతులు దులుపుకుంటున్నారే తప్ప, వాటిపై రేవంత్రెడ్డి సర్కారుకు చిత్తశుద్ధి ఉన్నట్టు ఏ మాత్రం కనిపించడం లేదని దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పిన రేవంత్రెడ్డి సర్కారు, మాట తప్పి ధర్నా పేరుతో ఢిల్లీలో నాటకాలాడారని మండిపడ్డారు. ఇప్పటికైనాఅఖిల పక్ష పార్టీ సభ్యుల సలహాలు, సూచనలను పెడచెవున పెట్టకుండా, శాస్త్రీయ పద్ధతుల్లో వాటిని రూపొందించాలని కేపీ వివేకానంద్ డిమాండ్ చేశారు.