Revanth Reddy | అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వకుండా సీఎం రేవంత్‌రెడ్డి మాదిగలను అణగదొక్కుతున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. తెలంగాణలో మాలల, రెడ్ల రాజ్యం నడుస్తుందని అన్నారు. హైదరాబాద్ విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్దిచెబుతామని హెచ్చరించారు.
మాదిగలకు కనీసం రెండు ఎంపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు దీక్ష చేస్తే సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోలేదని వంగపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలకు ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. తన రాజకీయ ఎదుగుదలకు మాదిగలే కారణమన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అధికార పీఠం ఎక్కగానే ఆ విషయం మరిచిపోయారని విమర్శించారు. మాదిగలకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా సీఎం రేవంత్‌రెడ్డికి మాదిగల ఓట్లు అడిగే హక్కులేదని అన్నారు.