హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): గోదావరి పుషరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజినీర్ల కమిటీని నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 20 రోజుల్లోగా నివేదికను అందజేయాలని అన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆదివారం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ కమిటీ హాలులో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రధాన ఆలయాలు, పుషర ఘాట్ల అభివృద్ధి, 2027 జూన్‌లో పుషరాల నాటికి పూర్తి చేయాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పుషరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలకు సంబంధించి టెక్నికల్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అంచనాలు రూపొందించి క్యాబినెట్ సబ్‌కమిటీకి పంపాలని సూచించారు. అనంతరం అధికారులు బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సీఎంకు వివరించారు.