Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యతిరేకించారు. ఈ విధానం వల్ల దక్షిణాది రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ర్టాల సీట్లు భారీగా పెరుగుతాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో 50% పెంచే ప్రతిపాదనను కాకుండా తాను హైబ్రిడ్ మాడల్‌ను సూచిస్తున్నట్టు తెలిపారు. హైబ్రిడ్ మాడల్ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన సచివాలయంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం చేస్తున్న చట్టాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆలోచన ప్రకారం 272 ఎంపీ సీట్లు పెరుగుతాయని చెప్పారు.
పెంచాలనుకుంటున్న ఈ 272 సీట్లలో హైబ్రిడ్ మాడల్‌లో ప్రొ రేటా ప్రకారం136 సీట్లు, జీఎస్డీపీ ప్రకారం మరో 136 సీట్లు పెంచాలని డి మాండ్ చేశారు. జనాభా ప్రకారం పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళా రిజర్వేషన్ల పెంపునకు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధం లేదని, అయినప్పటికీ రాజకీయ కోణంలో కేంద్రం కుట్ర చేస్తున్నదని దు య్యబట్టారు. కేంద్రం ప్రస్తుతం ఉన్న సీట్లపై 50% సీట్లు పెంచుతామని చెప్తున్నదని, ఇలా చేయడం వల్ల దక్షిణాది, ఉత్తరాది రాష్ర్టాల మధ్య సీట్ల అంతరం 412 నుంచి 620 సీట్లకు పెరుగుతుందని వివరించారు. తద్వారా దక్షిణాది రాష్ర్టాల అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
పునర్విభజనపై సీఎం వాదనలో లోపాలు
సీఎం వాదన: 2011 జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ర్టాలు నష్టపోతాయి.
వాస్తవం: జనాభాతో సంబంధం లేకుండా దామాషా లెక్కన లోక్‌సభలో ఇప్పుడు ఉన్న 543 సీట్లను 50% పెంచాలని కేంద్రం యోచిస్తున్నది. అంటే, జనాభాతో సంబంధం లేకుండా ఉత్తరాది, దక్షిణాది రాష్ర్టాలకు సీట్లలో పెరుగుదల శాతం సమానంగా ఉంటుంది.
సీఎం వాదన: ఉత్తరాది రాష్ర్టాల్లో ఐదారు రాష్ర్టాలు కలిస్తే, 410 సీట్లు నిండుతాయి.
వాస్తవం: ఉత్తరాదిలో అత్యధిక లోక్‌సభ సీట్లు ఉన్న ఐదు రాష్ర్టాలు ఉత్తరప్రదేశ్(80), పశ్చిమబెంగాల్ (42), బీహార్(40), మధ్యప్రదేశ్(29), గుజరాత్ (26).. ఈ ఐదు రాష్ర్టాల మొత్తం స్థానాలను కలిపినా 217 సీట్లు దాటడం లేదు. వీటికి 50% సీట్ల పెంపు అమలు చేసినా.. 325 సీట్లకే పరిమితం అవుతుంది.
సీఎం వాదన: జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లు 543కు చేరాయి. అప్పుడు దక్షిణాది రాష్ర్టాలు నష్టపోయాయి. ఇప్పుడు 543 స్థానాలను సరాసరిగా 50% పెంచుతామంటున్నారు. ఇది అన్యాయం.
వాస్తవం: 1971 జనాభా లెక్కల ప్రకారం.. అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1973లో నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టింది. దీంతో లోక్‌సభ సీట్లు 542కు (ఆ తర్వాత సిక్కింకు ఒక సీటు ఇచ్చారు) పెరిగాయి. అయితే, 543 సీట్ల పెంపు జనాభా ప్రాతిపదికన చేయడాన్ని ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి తప్పుబడుతున్నారు. అంటే, అప్పటి ఇందిరాగాంధీ సర్కార్ నిర్ణయం తప్పని చెప్తున్నట్టేగా!
సీఎం వాదన: దక్షిణ భారతదేశంలో జనాభా నియంత్రణ పాటించడం వల్ల జీఎస్డీపీ పెరిగింది.
వాస్తవం: జీఎస్డీపీ పెరుగుదలకు జనాభాతో సంబంధంలేదు. వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ వంటి కీలక రంగాల్లో జరిగే ప్రగతి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, విప్లవాత్మక ప్రభుత్వ విధానాలతో జీఎస్డీపీ పెరుగుతుంది. జనాభా తక్కువగా ఉంటే జీడీపీ పెరుగుతుందని చెప్పడం పొరపాటే. ఉదాహరణకు.. ఆస్ట్రేలియాకు సమీపంలో ఉన్న తువాలు అనే దేశ జనాభా 12 వేలు మాత్రమే. అయినప్పటికీ, ప్రపంచంలో అతి తక్కువ జీడీపీ నమోదు చేస్తున్న దేశంగా ఇది నిలిచింది.
సీఎం వాదన: హైబ్రిడ్ ప్రాతిపదికన సీట్లు పెంచాలి. కొత్తగా పెంచే సీట్లలో సగం స్థానాలను జీడీపీ ప్రాతిపదికన, మిగతా సగం జనాభా లెక్కన తీసుకోవాలి.
వాస్తవం: రాజ్యాంగంలోని ఆర్టికల్ 81, 82 ప్రకా రం.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరుగాలి. ఆర్టికల్-170 ప్రకారం.. అ సెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా ఇదే వి ధంగా జరుగాలి. జీడీపీ ప్రాతిపదికన డీలిమిటేషన్ పెంపు అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు.