CM Revanth Reddy | బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలో ఐదుగురు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లుగా నిర్ధారించేందుకు ఆధారాలు లేవని, వారంతా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్ బుధవారం తిరస్కరించారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. సీఎం గురువారం మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ నిర్ణయంతో తమకు సంబంధం లేదని, పార్టీగా మేం స్పందించడానికి ఏమీ లేదని, స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే కోర్టులు ఉన్నాయన్నారు.
కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు పార్టీ మారినట్లుగా నిర్ధారించేందుకు తగిన భౌతిక ఆధారాలు లేవని, సాంకేతికంగా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని స్పీకర్ తెలిపారు. తెల్లం వెంకట్రావు (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి)పై దాఖలైన పిటిషన్లను స్పీకర్ బుధవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు పార్టీ మారారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను సమర్పించలేదని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సందర్భాలను పార్టీ మారినట్లుగా పరిగణించలేమంటూ వారిపై అనర్హత వేటు వేసేందుకు నిరాకరించారు. అనర్హత పిటిషన్లపై ట్రిబ్యునల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న స్పీకర్ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చారు.