మణికొండ, డిసెంబర్ 14: కులగణన మెగా హెల్త్ చెకప్ లాంటిదని కుల గణన పూర్తయితే కురుమలకు జనాభా ప్రతిపాదికన దక్కాల్సిన వాటా దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కోకాపేటలో దొడ్డి కొమురయ్య కురుమ భవన్‌ను గురువారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం అధ్యక్షతన జరిగిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కురుమలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. వరంగల్‌లో నిర్మించబోయే విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరును పెట్టాలని కంచె ఐలయ్య కోరారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఐలయ్య, కర్ణాటక మాజీ మంత్రి రేవన్న, ఐఏఎస్ అధికారులు బాలమాయాదేవి, శ్రీధర్, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, శంకర్, శాసనమండలి చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. కురుమ భవనం ప్రారంభ సభ వెలవెలబోయింది. రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
కేసీఆర్ ప్రస్తావన లేకపోవడం బాధాకరం: కురువ విజయ్‌కుమార్
కురుమ భవన నిర్మాణ ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నేత విజయ్‌కుమార్ అన్నారు. కేసీఆర్ పేరును రేవంత్ ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎంత చెప్పుకున్నా వాస్తవాలు కురుమలకు తెలుసని అన్నారు.
కురమ భవన నిర్మాణం ఘనత కేసీఆర్‌దే:జగదీశ్వర్కురుమ
కురమ భవన నిర్మాణ ఘనత కేసీఆర్‌దేనని బీఆర్ఎస్వీ రాష్ట్ర నేత జగదీశ్వర్ కురుమ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో భవనాన్ని నిర్మిస్తే కాంగ్రెస్ నాయకులు తమ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రహరీ నిర్మాణానికే కాంగ్రెస్‌కు ఏడాది సమయం పట్టిందని విమర్శించారు. భవనం ప్రారంభం సందర్భంగా కేసీఆర్ గురించి మాట్లాడడకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.