హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కమ్మవారిలో నైపుణ్యాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కమ్మవారంటేనే అమ్మలాంటి వారని, అమ్మ వలె ఆకలి చూస్తారని అన్నారు. నేలను నమ్ముకొని కష్టపడి పని చేసేవారు కమ్మవారని కొనియాడారు. హెచ్ఐసీసీలో శనివారం నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కమ్మవారు వ్యవసాయం చేసి పదిమందికి అన్నం పెడుతున్నారని, సారవంతమైన భూములున్నచోట కమ్మవారంటారని వ్యాఖ్యానించారు. కమ్మ సామాజికవర్గంతో తనకు ప్రత్యేకమైన సంబంధం ఉన్నదని అన్నారు. తాను ఎక్కడున్నా.. వాళ్లు ఎంతగానో అభిమానిస్తారని చెప్పారు.
కమ్మ సామాజికవర్గానికి చెందిన ఎన్టీఆర్.. రాజకీయాల్లో బ్రాండ్ క్రియేట్ చేశారని, ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపై వివక్ష ఉండదని, అది తమ ప్రభుత్వ విధానం కాదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఒక హక్కు అని, పన్నులు కట్టే ప్రాంతంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. వివాదంలో ఉన్న ఐదెకరాల కమ్మ సంఘం భూ సమస్యను పరిషరిస్తామని, భవన నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడంలో భాగస్వామ్యం కావాలని కమ్మవారికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కుసుమ కుమార్ ఇతర కమ్మ నాయకులు పాల్గొన్నారు.