Revanth Reddy | హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : రాజధానిలోని డీజిల్ ఆటోలు, బస్సులు, ఇతర వాహనాలను ఔటర్ రింగ్‌రోడ్డు బయటకు పంపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో శుక్రవారం జరిగిన సీఐఐ జాతీయ కౌన్సిల్లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఫ్యూచర్ సిటీని దేశంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని, ప్రపంచ మేటి నగరాలైన న్యూయార్క్, లండన్, సియోల్, దుబాయ్‌తో పోటీపడేలా నిర్మిస్తామని చెప్పారు. అనంతరం సచివాలయంలో ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఆదివాసీలకు రాజకీయంగా న్యాయం చేస్తామని, కుమ్రం భీం జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఆదివాసీ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సదుపాయం, సాగు, తాగునీటి వసతులు క్పలించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉద్యమ నేపథ్యంలో ఆదివాసీలపై నమోదైన కేసులను తొలిగిస్తామని భరోసా ఇచ్చారు.
మధ్యాహ్నం తర్వాత సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో జరిగిన సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పంట వేసినా, వేయకపోయినా సాగుయోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ నాలుగు పథకాల అమలుపై రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభల నిర్వహణ, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించేందుకు శనివారం నుంచి ఈ నెల 15 వరకు సన్నాహాలు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వ్యవసాయానికి అకరకు రాని భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలని, వాటిని సభల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. ఇన్చార్జి మంత్రి ఆమోదించిన ఇందిరమ్మ ఇండ్ల జాబితానే అర్హుల జాబితా విడుదల చేయాలని ఆదేశించారు. కొందరు అధికారులు పనితీరును మార్చుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని, నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
‘రాజధానిలోని డీజిల్ ఆటోలు, బస్సులు, ఇతర వాహనాలను ఔటర్ బయటకు పంపిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనతో సుమారు 12 లక్షల మంది వాహనదారులపై ప్రభావ పడనున్నది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆటోవాలాలపై మరో పిడుగు పడినట్టయింది. స్కూల్ బస్సులు, క్యారియర్లు, లారీలు నడుపుతూ ఉపాధి పొందుతున్న డ్రైవర్లు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉన్నది. సీఎం ప్రకటనలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని ఆటోవాలాలు, క్యాబ్‌లు, స్కూల్ బస్సుల డ్రైవర్లు, ఇతర డీజిల్ వాహనాల డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూడు జిల్లాల్లో కలిపి దాదాపు కనీసం 12 లక్షల వాహనాలను ఔటర్ బయటకు తరలించాల్సి వస్తుందని తెలుస్తున్నది.
ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్‌రెడ్డి తరచూ చేస్తున్న హడావుడి ఎందుకు చేస్తున్నారోనని విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఓవైపు న్యాయస్థానానికి ఫార్మాసిటీని కొనసాగిస్తామని చెప్తూనే, మరోవైపు అక్కడే ఫ్యూచర్ సిటీ అంటూ హడావుడి చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఇది ప్రజలతోపాటు వ్యాపారవేత్తలను, కంపెనీలనూ మోసం చేయడం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. పైగా కనీసం ఉనికి ఎక్కడో తెలియని ఫ్యూచర్ సిటీని రోజుకో అంతర్జాతీయ నగరంతో పోల్చడాన్ని సైతం ఎద్దేవా చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడేముందు అది ఎక్కడ నిర్మిస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): నీటిపారుదల శాఖలో పనిచేసే ఇంజినీర్లు విధి నిర్వహణలో అలసత్వం చూపవద్దని, నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ రూపొందించిన 2025 డైరీని జలసౌధలో శుక్రవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఇంజినీర్లు క్రమశిక్షణ, పారదర్శకతకు ప్రాధన్యమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఈఎన్సీలు అనిల్‌కుమార్, విజయభాసర్‌రెడ్డి, అసోసియేషన్ ప్రెసిడెంట్ రాపోలు రవీందర్, ప్రధాన కార్యదర్శి చక్రధర్, గౌరవాధ్యక్షుడు ధర్మ, వరింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, మధుసూదన్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.