Telangana | హైదరాబాద్, అక్టోబరు 5 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించి, ఆదేశాలు జారీ చేసిన ఫైల్‌కే ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు పెడుతున్నారు. సీఎం హామీ ఇస్తే తమకేంటి… అంటూ ఫైల్‌ను తిరస్కరించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.10లక్షల ప్రమాద బీమా, రూ.2 లక్షల లోన్ బీమా కల్పించనున్నట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి పరేడ్ గ్రౌండ్ సభలో ప్రకటించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు లోక్‌సభ ఎన్నికల ముందు ఇచ్చారు. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించి ఆరు నెలలైనా ఇంతవరకు చెల్లించలేదు. ప్రీమియం నిధుల విడుదలకు ఫైల్ ఆర్థికశాఖకు పంపిస్తే అధికారులు తిరస్కరించినట్టుగా తెలిసింది. రాష్ట్రంలో 50లక్షలకు పైగా మహిళా స్వయం సంఘాల సభ్యులు ఉండటంతో ప్రీమియం మొత్తం ఎక్కువగా అవుతుందని, అంతమొత్తం చెల్లించడం కష్టమని, ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని ఆర్థిక శాఖ అధికారులు సూచించినట్టుగా సమాచారం. దీంతో ఆ పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైందని, ఇప్పటికే సీఎం పథకాన్ని ప్రకటించినందున అమలు ఎలా చేయాలనే దానిపై సెర్ప్, స్త్రీ నిధి అధికారులు తర్జనభర్జన పడుతున్నట్టుగా సమాచారం. ఆరు నెలలైనా ఇంకా ప్రీమియం చెల్లింపు దశలోనే ఉండటంపై ఎస్‌హెచ్‌జీ సభ్యులు నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్వయం సహాయక సంఘాల సభ్యులకు లోన్ ఇన్సూరెన్స్ కింద స్వయం సహాయక సభ్యురాలు ఏ కారణంగానైనా మరణిస్తే ఆమె చెల్లించే బ్యాంకు లోన్‌ను రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ డబ్బు ద్వారా చెల్లిస్తారు. సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆమె నామినీకి రూ.10లక్షలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం అమలు బాధ్యతను స్త్రీ నిధికి అప్పగిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు.