హనుమకొండ, జనవరి 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల ప్రకటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొనే ఈ ప్రకటనలు చేస్తున్నట్టు విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. ఇందుకు జనాభా గణనే ప్రధాన అడ్డంకి అని పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జనాభా గణనకు నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా 2025 నవంబర్లోనే ఈ ప్రక్రియ చేపట్టింది. 2026 ఏప్రిల్ 1 నుంచి 2026 సెప్టెంబర్ 26 వరకు మొదటి దశ, 2026 అక్టోబర్ నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు రెండోదశ జనాభాగణన జరుగనున్నది. జనాభా మదింపు, మార్పులు, తుది గణాంకాలు, నివేదికల వెల్లడి వంటి ప్రక్రియ 2027 డిసెంబర్ వరకు కొనసాగనున్నది.
జనాభా గణన పూర్తయ్యే వరకు రెవెన్యూపరంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఎలాంటి మార్పులకు అవకాశంలేదని విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. ఈ కారణంగానే ఏపీ ప్రభుత్వం ఇటీవల జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపట్టిందని నిపుణులు చెప్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచింది. వాస్తవానికి మొదట్లోనే జిల్లాల సంఖ్యను కుదిస్తారని ప్రచారం జరిగింది. 33 జిల్లాలను 25కు తగ్గిస్తారని ప్రభుత్వమే లీకులు ఇచ్చింది. కానీ, ఈ ప్రక్రియను ముందుకుతీసుకెళ్లలేదు. ఇప్పుడు నిబంధనలు స్పష్టంగా ఉన్నా జిల్లాల పునర్వ్యవస్థీకరణను తెరమీదికి తీసుకురావడంపై విశ్లేషకులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రజలదృష్టిని మరల్చేందుకు ఉద్దేశపూర్వకంగానే ప్రకటన చేసినట్టు చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే లక్ష్యంతోనే ఇలా హడావుడి చేస్తున్నట్టు భావిస్తున్నారు. ప్రజాభిప్రాయం పేరుతో జిల్లాలమార్పు అనివార్యమైతే అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు.