హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని యూనివర్సిటీలను కొందరు ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మార్చొద్దని సీఎం రేవంత్‌రెడ్డి వైస్చాన్స్లర్లకు సూచించారు. డబ్బున్న వారంతా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వైపు వెళ్లిపోతున్నారని, అందువల్ల ప్రభుత్వ వర్సిటీలు ప్రైవేట్‌తో పోటీపడాలని అన్నారు. విద్యార్థి కేంద్రంగా వర్సిటీలు పనిచేయాలని చెప్పారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం సీఎం యూనివర్సిటీలపై సమీక్షించారు.
పెద్దగా ప్రాధాన్యంలేని కోర్సులను రద్దుచేసి, కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని చెప్పారు. యూనివర్సిటీ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావుతో సమావేశం కావాలని సూచించారు. అనంతరం వర్సిటీల వారీగా చర్యలపై నివేదిక రూపొందించి సమర్పించాలని అన్నారు.
రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధాన పత్రం రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి విద్యాకమిషన్‌ను ఆదేశించారు. ఉత్తమ విద్యావ్యవస్థ కోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోమని చెప్పారు. అంగన్వాడీలు, పాఠశాలల్లో తీసుకురావాల్సిన మార్పులపై అన్ని వర్గాలతో చర్చించి విధానపత్రాన్ని తయారుచేయాలని సూచించారు.
ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రధానకార్యదర్శి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, శ్రీనివాసరాజు, సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర ఈవీ నర్సింహారెడ్డిలు పాల్గొన్నారు.