హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్‌లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు పలు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కొనియాడారు. లైంగికదాడి బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడంలో ఇవి అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఎంసీహెచ్ఆర్డీలో రెండ్రోజుల పాటు నిర్వహించే ‘స్టేట్ లెవల్ స్టేక్‌హోల్డర్స్ కన్సల్టేషన్ మీట్-2025’లో ‘వాయిస్ ఫర్ ది వాయిస్‌లెస్’ అనే థీమ్‌లో పిల్లల హక్కులు, రక్షణ, లైంగిక వేధింపులపై సమావేశం నిర్వహించారు. ఉమెన్ సేఫ్టీ వింగ్, ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, యూనిసెఫ్, తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణలోని భరోసా కేంద్రాలు ‘విక్టిమ్ సెంట్రిక్ సపోర్ట్’ను అందిస్తున్నాయని ప్రశంసించారు. పోలీసు సపోర్ట్, లీగల్ ఎయిడ్ సపోర్ట్, మెడికల్ కేర్, సైకలాజికల్ కౌన్సెలింగ్ వంటి వ్యవస్థలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి లైంగికదాడుల బాధితులకు సత్వర న్యాయం అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. మిగతా రాష్ర్టాలు కూడా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని సూచించారు. బాధితులకు అందే న్యాయం బాధను కొంత తగ్గిస్తే, పునరావాసం, రక్షణ అనేవి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.
నల్సార్‌లో తీసుకొచ్చిన ‘చైల్డ్‌ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ స్కీమ్-2024’లో మానసిక రక్షణ అందడంతో పాటు, బాధితులకు నష్టపరిహారం కూడా అందుతుందని చెప్పారు. భరోసా కేంద్రాలను ప్రారంభించిన కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా ఇది చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఇలాంటి సాయం దేశవ్యాప్తంగా అందాలని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న ‘ఇన్ విజిబుల్ విక్టిమ్ సిస్టమ్’ గురించి తాను 2014లో మొదటిసారిగా మాట్లాడినట్టు గుర్తు చేసుకున్నారు.
చిన్నారుల పట్ల లైంగికదాడి విషయాల్లో ఇండ్లు, విద్యాలయాలు, పరిసర ప్రాంతాలు, తెలిసిన వ్యక్తులు, స్నేహితులు, బంధువులు పట్ల జాగ్రత్తగా ఉండాలని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. చిన్నతంలోనే అమ్మాయిలు లైంగిక దాడికి గురైతే అది నేరం మాత్రమే కాదని, సమాజంపై నమ్మకాన్ని కోల్పోవడం కూడా అవుతుందని చెప్పారు. ప్రభుత్వాలు, తల్లిదండ్రుల వైఫల్యం కూడా అవుతుందని తెలిపారు. కాబట్టి మనమంతా బాధ్యత తీసుకోవాలని అన్నారు. భౌతికంగా లైంగిక దాడులకు గురైతే ఆ బాధ వారిని జీవితాంతం వెంటాడుతుందని, ఆ ఆలోచనలు ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తాయని అన్నారు. ‘పోక్సో కేసులపై పోలీసులు నిశితంగా, నిజాయితీగా విచారణ చేయాలి. విద్యావ్యవస్థలు విద్యార్థులకు లైంగిక వేధింపులు, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించాలి. న్యాయవ్యవస్థ కూడా త్వరతిగతిన తీర్పులు ఇచ్చేలా ఉండాలి’ అని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో డిసెంబర్ 2020 నాటికి పోక్సో పెండింగ్ కేసులు 5,267 ఉన్నట్టు రాష్ట్ర హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్ తెలిపారు. 2024 అక్టోబర్ నాటికి ఇవి 8,308కి పెరిగినట్టు తెలిపారు. ఈ లెక్కలు రాష్ట్రంలో ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 98 శాతం మంది చిన్నారులు తెలిసిన వారు, స్నేహితుల కుటుంబసభ్యుల ద్వారానే అత్యాచారాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలపై లైంగిక దాడులు అరికట్టేందుకు మహిళా శిశు సంక్షేమ విభాగం, విద్యాశాఖ, పోలీసుశాఖ, ఆర్అండ్బీ, ఆరోగ్యశాఖ వంటివి ఒకే లక్ష్యంగా, ఒకే గొడుగు కింద పనిచేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం పిల్లలు, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బాలికల సంరక్షణ కోసం రాష్ట్రంలో ‘భరోసా’ ప్రాజెక్టును కొనసాగిస్తున్నట్టు చెప్పారు. భరోసా సెంటర్‌కు అనుబంధంగా 29 కేంద్రాలు తెలంగాణలో పనిచేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భరోసా కేంద్రం ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. లైంగిక నేరాలను అరికట్టేందుకు తీసుకునే చర్యల్లో యునిసెఫ్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని యూ నిసెఫ్ ప్రతినిధి సింథియా మెక్ కెఫ్రీ అన్నారు. తెలంగాణలో చైల్డ్ అబ్యూజ్ మెటీరియల్ ఉపయోగించి పోర్న్ చూస్తున్న వారిని కట్టడి చేస్తున్నట్టు డీజీపీ జితేందర్ వెల్లడించారు.
స్టేట్ లెవల్ స్టేక్‌హోల్డర్స్ కన్సల్టేషన్ మీట్-2025’కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చీఫ్ జస్టిస్‌ను చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన రెండుసార్లు తడబడ్డారు. కార్యక్రమం ప్రారంభమైన వెంటనే వేదికపైకి వచ్చిన అతిథులకు ఆహ్వానం పలికి పూల మొక్క ఇచ్చే క్రమంలో నోరుజారారు. ‘తెలంగాణ చీఫ్ జస్టిస్ రేవంత్‌రెడ్డికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోషి పూల మొక్క అందిస్తారు’ అంటూ తడబడ్డారు. కార్యక్రమంలో చివర్లో శాలువాతో సన్మానించేటప్పుడు కూడా ‘తెలంగాణ చీఫ్ జస్టిస్ రేవంత్‌రెడ్డి’ అంటూ తడబడి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని సరిదిద్దారు. కార్యక్రమంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన వెంటనే పిల్లల రక్షణ, హక్కులు, సెక్సువల్ అబ్యూజ్‌పై పలు విభాగాలకు చెందిన నిపుణులు విస్తృతంగా చర్చలు జరిపారు.