Telangana | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున మొత్తం 119 నియోజకవర్గాలకు రూ.1,190 కోట్లు కేటాయిస్తున్నాను అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన పగ్గాలు చేపట్టిన కొత్తలో ఆర్భాటంగా ప్రకటించారు. ఈ మాట చెప్పి 16 నెలలైనా నిధులు విడుదల కాకపోవడంతో ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిధులు లేక నియోజకవర్గంలో చిన్న చిన్న అభివృద్ధి పనులకు కూడా చేయలేకపోతున్నామని మండిపడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ప్రభుత్వంలో ఉన్నా ఏమీ చేయలేక జనాలకు మొహం చూపించుకోలేకపోతున్నామని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే తమను గ్రామాల్లోకి కూడా ప్రజలు రానివ్వరని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. 2024 జనవరిలో నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీఎఫ్)కుస్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అని పేరు మార్చింది. 119 నియోజకవర్గాలకు రూ.10 కోట్ల చొప్పన రూ.1,190 కోట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నిధుల ప్రతిపాదనలకు జిల్లా ఇన్చార్జ్ మంత్రుల ఆమోదం తప్పనిసరి కావడంతో అనవసర జాప్యం అవుతున్నదని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నియోజకవర్గంలో సగటున రూ.1.5 కోట్ల విలువైన అభివృద్ధి కూడా జరుగలేదని చెప్తున్నారు. చిన్న రోడ్డు మరమ్మతు, బోర్వెల్ వంటి పనులకు కూడా మంత్రుల వెంట పరుగెత్తాల్సి వస్తున్నది. ఇైట్లెతే ప్రజలు మమ్మల్ని గ్రామాల్లోకి రానివ్వరు అని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గాల అభివృద్ధి నిధులు పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు అందరికీ విడుదలయ్యేవి. ఎంపీ నిధులతో సమానంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏటా రూ. 5 కోట్లకు పెంచారు. ఈ నిధులను శాసనసభ్యులు సిఫారసు చేసిన పనుల కోసం జిల్లా కలెక్టర్లు విడుదల చేసేవారు. కానీ, ప్రస్తుతం ఒక రూపాయి కూడా స్వేచ్ఛగా ఖర్చు చేసే అవకాశం లేక, ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, అభివృద్ధి పనులు చేయకుండా మళ్లీ వచ్చే ఎన్నికల్లో జనాల్లోకి వెళ్లి ఓట్లు ఎలా అడుగుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు సన్నిహితుల వద్ద వాపోయారు. ఇలాగే అయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. చిన్నచిన్న పనులు కూడా చేయలేకపోతే నమ్మకం పోతున్నదని చెప్తున్నారు.
పార్లమెంట్ సభ్యుల ఎంపీలాడ్స్ నిధుల తరహాలో శాసనసభ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేకంగా కేటాయించిన నిధి సీడీఎ ఫ్. ఈ నిధులతో తాగునీరు, డ్రైనేజీ పైప్లైన్లు, ప్రజారోగ్య, పాఠశాల భవనాలు, ట్యాంకులు, సీసీ రోడ్లు, సీసీటీవీలు, వృక్షసంపద, స్థానిక ప్రజామౌలిక సదుపాయాలు, స్ట్రీట్ లైట్ల వంటి అభివృద్ధి పనులను శాసనసభ్యులు సిఫారసు చేయవచ్చు. మొత్తం కేటాయింపులో 40 శాతం గ్రీన్ క్యాంపెయిన్‌కు, కొంత ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికి ఖర్చు చేయా ల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పాలనలో ఏడాదిన్నరగా నిధులు లేక పదవులు నామ్‌కే వాస్తే అయిపోయాయని వాపోతున్నారు.