హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్)లో ఆర్అండ్బీ పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్ల రోడ్లు నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. మూడేండ్లలో నిర్మాణం పూర్తికావాలని చెప్పారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు, హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణంపై సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రూ. వెయ్యి కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఇకపై నెలకు రూ.150 కోట్ల చొప్పున జూన్ వరకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు సూచించారు. మారుమూల పల్లెల్లోనూ కార్లు, ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో రహదారుల కొలతలను పునర్నిర్వచించాల్సి ఉన్నదని, వాటి రాకపోకలకు వీలుగా రోడ్లు విస్తరించాలని సూచించారు.
ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ఉండాలని స్పష్టంచేశారు. గ్రామాల నుంచి మండలాలకు సింగిల్రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు కచ్చితంగా ఉండాలని చెప్పారు. గుంతలు పడ్డ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణంలో ఒకే నాణ్యతాప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని చెప్పారు. నాగ్పూర్-విజయవాడ (ఎన్హెచ్ -163జీ) రహదారి, ఆర్మూర్ -జగిత్యాల -మంచిర్యాల రహదారి (ఎన్ హెచ్ -63), జగిత్యాల -కరీంనగర్ (ఎన్ హెచ్ 563) రహదారుల భూసేకరణపైనా చర్చించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక , కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.