Professor K Nageshwar | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎవరూ హర్షించరని రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి ఇటువంటి సలహాలు ఎవరిస్తున్నారో తెలియడం లేదని, ఆయన తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నారని అన్నారు. గురువారం రాత్రి ఆయన ఓ టీవీ చానల్లో మాట్లాడుతూ.. కేసీఆర్కు స్టేచర్ చరిత్ర ఇచ్చింది.. తెలంగాణ పోరాటమిచ్చింది.. ప్రజలు ఇచ్చారు అని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన స్టేచర్ పోదని స్పష్టంచేశారు. తెలంగాణ రథసాథి కేసీఆర్ అని.. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను కాదనేవారు ఎవరున్నారని ప్రశ్నించారు.
అనాడు మలిదశ పోరాటంలో కేసీఆరే తెలంగాణ జెండా పట్టుకోకుంటే ఈ రోజు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులకు తెలంగాణ జెండా ఉండేదా? అన్నది గుర్తు చేసుకోవాలని చెప్పారు. అలాంటి మహానేతను పట్టుకొని మార్చరీకి పోతారని మాట్లాడటం బాధాకరమని అన్నారు. ఎవరైనా ఏ రోజైనా మార్చురీకి పోవాల్సిందేననే వాస్తవం గుర్తుంచుకోవాలని చెప్పారు. ఏ రాజకీయ నేతకైనా అందులోనూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇలాంటి వ్యాఖ్యలు శోభనివ్వవని స్పష్టం చేశారు. రేవంత్రెడ్డి ఎందుకు నోరుజారుతున్నారో అర్థంకావడంలేదని అన్నారు. అధికారంలోలేని వ్యక్తిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలకు అహంకారంలా కనిపిస్తుందని పేర్కొన్నారు. రేవంత్ మాటలు ఆయనలో పెరిగిన అసహనం, అక్కసుకు నిదర్శనంగా ఉన్నాయని చెప్పారు.