‘రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుల అవసరం ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సలహాదారు వ్యవస్థను లేకుండా చేస్తాం’ – 2022 జూలై 18న ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డిని విమర్శిస్తూ, 2023 మే 9న ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ సోమేశ్‌కుమార్ నియామకాన్ని విమర్శిస్తూ నాటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలివి.
‘రాష్ట్ర ఖజానాకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించడంలో సలహాదారుల పాత్ర ఉన్నది. సలహాదారుల అవసరం లేదు’ – బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన ఏడుగురు సలహాదారులను 2023 డిసెంబర్ 10న తొలిగించిన అనంతరం ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి.
CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం 12 మంది సలహాదారులు, ముగ్గురు కన్సల్టెంట్లు, ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నాల్కల ధోరణికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సలహాదారుల వ్యవస్థను రద్దు చేస్తామంటూ బీరాలు పలికిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే వ్యవస్థను నెత్తికెక్కించుకున్నారు. తన అత్యంత ఆప్తులకు, కాంగ్రెస్ అంసతృప్తులకు పునరావాసంగా, వ్యాపార ప్రయోజనాల కోసం ఈ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారనే విమర్శలున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో 12 మంది సలహాదారులు ఉన్నారు.
ముగ్గురికి డైరెక్టర్లుగా, ముగ్గురుకి కన్సల్టెంట్లగా పదవులు కట్టబెట్టారు. వీరిలో ముఖ్యనేతలకు ఆప్తులు కొందరు కాగా, మరికొందరు రాజకీయ పునరావాసం కోటాలో అధిష్ఠానం ఆదేశాల మేరకు కుర్చీ అందుకున్నవారు ఉన్నారు. వీరితోపాటు ఏపీ నేతలు ఒత్తిడి చేసి చొప్పించిన వాళ్లు కూడా ఉన్నరనే విమర్శలున్నాయి. వీరిలో ముగ్గురు నలుగురిని మినహాయిస్తే, మిగతావారు ఆయా రంగాల్లో నిపుణులు కారని, కనీస అర్హతలు కూడా లేవని అంటున్నారు. ఈ ప్రహసనం ఇంతటితో ఆగేటట్టు లేదని, మరింత మందిని సలహాదారులగా నియమించి క్యాబినెట్ హోదా కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి.
2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మూడు రోజులకు 10న ఏడుగురు సలహాదారులను తొలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ఖజానాకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించడంలో సలహాదారుల పాత్ర ఉన్నదని, తమ ప్రభుత్వానికి సలహాదారుల అవసరం లేదని చెప్పుకున్నారు. కానీ, జనవరి 20న అంటే అధికారంలోకి వచ్చిన నెలన్నరకు తనకు అత్యంత నమ్మకస్తుడైన వేం నరేందర్‌రెడ్డిని ప్రధాన సలహాదారుగా నియమించారు. క్యాబినెట్ హోదా కల్పించారు. ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ శాఖల ప్రధాన సలహాదారుగా నియమించి క్యాబినెట్ హోదా ఇచ్చారు. నిజానికి, ఆయన ఎమ్మెల్సీ పదవిని, మంత్రి పదవిని ఆశించారు. ఆ మేరకు ఢిల్లీ నుంచి హామీ కూడా తీసుకున్నారు. ఆయనను తాత్కాలికంగా చల్లబరచడం కోసం ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టి పునరావాసం కల్పించారన్న విమర్శలు ఉన్నాయి.
పార్లమెంటు ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఏపీ జితేందర్‌రెడ్డిని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా, బీఆర్ఎస్ నుంచి గోడదూకిన పోచారం శ్రీనివాసరెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుగా, రాజ్యసభకు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన కేశవరావుని పబ్లిక్ ఎఫైర్స్ సలహాదారుగా, కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియర్ నేత హర్కర వేణుగోపాల్‌ను ప్రొటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారుగా నియమించి, క్యాబినెట్ హోదా కట్టబెట్టారు. ఇలా రాజకీయ పునరావాసం, గోడదూకిన నేతల్లో ఆరుగురికి సలహాదారుగా నియమించారని విమర్శిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగిస్తున్నారని అప్పట్లో చెప్పిన ముఖ్యమంత్రే అప్పులు తెచ్చి మరీ వారికి జీతభత్యాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. పైగా ఏ శాఖలో ఎంత మందిని నియమిస్తున్నారో, ఏ హోదాలో ఇస్తున్నారో అంతుచిక్కడం లేదని అంటున్నారు.
ఏపీ నేతల సిఫారసు మేరకు ముగ్గురు అధికారులు తెలంగాణ ప్రభుత్వంలో చేరారని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్‌దాస్‌ను నీటి పారుదల వ్యవహారాల సలహాదారుడిగా క్యాబినెట్ హోదాలో ప్రభుత్వం నియమించింది. ఆయన ఏపీ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన నేపథ్యంలో నైపుణ్యపరంగా శంకించాల్సిన పని లేదు కానీ, ఆయన హయాంలోనే తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలించుకుపోయారనే విమర్శలు ఉన్నాయి. దుమ్ముగూడెం, పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం అమలులో కూడా ఆయన కీలకపాత్ర పోషించారని అంటున్నారు.
రాష్ట్రంలో అనేకమంది నీటిపారుదలరంగ నిపుణులు ఉండగా ఏపీకి చెందిన రిటైర్డ్ అధికారిని ఎందుకు నియమించారన్న ప్రశ్నలు ఉన్నా యి. ఏపీకి చెందిన శ్రీనివాసరాజును ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సలహాదారుగా నియమించారు. శాసనసభ చరిత్రలోనే తొలిసారిగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం శాసనసభ వ్యవహారాల సలహాదారు పోస్టును సృష్టించింది. సూర్యదేవర ప్రసన్నకుమార్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఆయనను అగమేఘాల మీద ఢిల్లీ నుంచి తీసుకొచ్చి బాధ్యతలు అప్పజెప్పడం వెనుక ఎవరి హస్తం ఉన్నదనేది ప్రశ్నార్థకంగా మారింది.
2018లో అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్ర ఎత్తిపోతల పథకం సలహాదారుగా పెంటారెడ్డిని నియమించారు. ఈ నియామకంపై పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్‌రెడ్డి రాయలేని పదజాలంతో దూషించారు. 2022 జూలైలో ‘పెంటారెడ్డి ఇంజినీరింగ్ చదివాడా? గాడిదలు కాసిండా?’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే పెంటారెడ్డికి సలహాదారుగా పదవీ కాలాన్ని పొడిగించి కొనసాగిస్తున్నారు. పెంటారెడ్డి పదవీకాలం మే15తో ముగియగా, ప్రభుత్వం ఆరో నెలలు పొడిగించింది. ఇప్పుడు మరోసారి పదవీ కాలాన్ని పొడించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డిని గతంలో ప్రజాభవన్ ఆదేశాలు శిరసావహించే వ్యక్తిగా రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. ఇప్పుడు కృపాకర్‌రెడ్డి పదవీకాలం ముగిసినా మళ్లీ ఈఎన్సీగా పదవీకాలాన్ని పొడగించడం గమనార్హం. మహిళా సాధికారత కోసం నెలకొల్పిన హబ్‌కు ఒక మహిళను సీఈవోగా నియమించారు.
ఊరూపేరూ తెలియని వ్యక్తికి పదవి కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వంలోని ముఖ్యనేత భార్య రాష్ట్రంలోని సంపన్నుల కోసం నడిపిస్తున్న ఒక బొటిక్కు ఆమె కన్సల్టెంటుగా పని చేశారని, అందుకే పదవి దక్కిందనే ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏలో ఇద్దరు మహిళలకు కన్సల్టెంట్‌గా బాధ్యతలు అప్పగించారని, వీరి విధులేమిటో, ఏ పని చెప్పాలో తెలియక అధికారులు తలపట్టుకున్నారని హెచ్ఎండీఏ వర్గాలు చెప్తున్నాయి.
ఒక మీడియా సంస్థ యజమాని సిఫారసు మేరకు ఇటీవల ఒక రిటైర్డు అధికారికి విజిలెన్స్ విభాగంలో కీలక పోస్టు అప్పగించినట్టు సమాచారం. ఇలా అధికారంలోకి రాకముందు తిట్టిన నోటితోనే.. ఇప్పుడు సలహాదారులను నియమిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగదని.. బీఆర్ఎస్ నుంచి గెలిచి గోడదూకిన 10 మంది ఎమ్మెల్యేల్లో కనీసం ఆరుగురిని సలహాదారులుగా నియమించి, క్యాబినెట్ హోదా కల్పించాలనే ఆలోచనతో ఉన్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.