హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): నుమాయిష్ హైదరాబాద్‌కు ఎంతో ప్రాధాన్యత తెచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్-2024 ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్‌బండ్ తర్వాత గుర్తొచ్చేది నుమాయిష్ అని తెలిపారు. ఏటా నుమాయిష్‌ను ప్రాధాన్యత తగ్గకుండా నిర్వహిస్తున్న సొసైటీకి అభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజినీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాటితోపాటు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. 8 దశాబ్దాలుగా ప్రదర్శనను నిర్వహిస్తున్న సొసైటీ సభ్యులను మంత్రి శ్రీధర్‌బాబు అభినందించారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సత్యేందర్, కార్యదర్శి బీ హన్మంతరావు, కోశాధికారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.