Mohammed Siraj | హైదరాబాదీ, టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. క్రికెటర్‌కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ క్రికెట్ భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చాడంటూ మొహమ్మద్ సిరాజ్‌ను సీఎం అభినందించారు. టీ20 వరల్డ్ కప్‌ను గెలిచిన అనంతరం హైదరాబాద్‌కు చేరిన సిరాజ్ మంగళవారం ఉదయం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సిరాజ్‌ను సీఎం ఘనంగా సన్మానించారు. సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్లో తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడని, అందుకే ఈ రోజు అత్యున్నత స్థాయి క్రికెటర్లలో ఒకడిగా పేరు సంపాధించాడని సీఎం ప్రశంసించారు.
సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇటీవల, వెస్టిండిస్-అమెరికా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను భారత జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సిరాజ్‌కు హైదరాబాద్‌లో క్రికెట్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాగా, బీసీసీఐ నుంచి రూ.125 కోట్ల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. సిరాజ్ సహా 15 మంది ఆటగాళ్లలో ఒక్కొక్కరికి రూ.5 కోట్లు పారితోషకం అందనున్నది.