నాగర్‌కర్నూల్ : ఇందిరా సౌర గిరి జలవికాసం పథకాన్ని (Indira Saura Giri Jal Vikasam ) నాగర్‌కర్నూలు (Nagarkurnool district ) జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మాచారం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth reddy ) సోమవారం ప్రారంభించారు. గిరిజన పోడు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కింద సౌర విద్యుత్ ను ఉచితంగా అందజేస్తుంది. ఈ పథకాన్ని నల్లమల అటవీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న రైతులకు బిందు సేద్యం, తోటల పెంపకానికి ప్రోత్సహకాలను ఉచితంగా అందచేస్తుంది.
ఈ సందర్భంగా మాచారంలో జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపుసెట్లు ( Solar Pumpsets ) అందిస్తామని ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 60 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశామని వెల్లడించారు. సన్నాలు పండించే రైతులకు మద్దతు ధరతోపాటు రూ. 500 బోనస్ అందిస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మంది పేదలకు సన్న బియ్యం, 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించామని వివరించారు. అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు ప్రోత్సాహం అందిస్తున్నామని, ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టాలని ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, తదితరులు
పాల్గొన్నారు.