ఖమ్మం, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. జనప్రవాహం పోటెత్తింది.. బుధవారం ఖమ్మం జిల్లా సత్తపల్లి నియోజకవర్గం కల్లూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు జన సునామీలను తలపించాయి. సభలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా జన నేతను చూసేందుకు వేచి ఉన్నారు. సభా ప్రాంగణంలో సెల్ఫీలు తీసుకుంటూ యువతీ యువకులు సందడి చేశారు. ‘జై కేసీఆర్.. జై జై కేసీఆర్’ నినాదాలతో సభా ప్రాంగణాలు దద్దరిల్లాయి. సీఎం కేసీఆర్ రాక బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వివరిస్తుండగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవహార శైలిపై పరోక్షంగా సీఎం సంధించిన వాగ్బాణాలకు ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రతి ఎస్సీ కుటుంబానికి దళితబంధు ఇస్తానని, పథకం ఇచ్చేరోజు తానే స్వయంగా సత్తుపల్లికి వస్తానని ప్రకటించినప్పుడు సభికులు కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తంచేశారు. ఇల్లందులో ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న, సత్తుపల్లిలో ప్రజాగాయని మధుప్రియ బృందం ప్రదర్శించిన ధూంధాం సభికులను ఉర్రూతలూగించింది. సత్తుపల్లిలో గులాబీజెండాపై మధుప్రియ పాడిన పాటకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య నృత్యం చేసి సభికులను ఉత్సాహపరిచారు.