Gruha Lakshmi Scheme | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు తీపి కబురు చెప్పింది. ఇండ్లు లేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ‘గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సొంత జాగల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆర్థిక సాయం చేయనున్నది. ఈ ఏడాది జులై నుంచి పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో ప్రజలకు మేలు కలిగేలా పలు కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా పలు కార్యక్రమాలకు సంబంధించి రూపకల్పనపై సీఎం తుది నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవాలపై ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గృహలక్ష్మి పథకాన్ని జులై నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.
గతంలో శాసనసభలో చెప్పినట్టుగానే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకొనేందుకు ఆర్థిక స్థోమతలేని పేదల కోసం ‘గృహలక్ష్మి పథకం’ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మార్చిలో జరిగిన ‘గృహలక్ష్మి’ అమలుకు నిర్ణయం కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముందుగా 3వేల మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేనివారికి, అలాగే ఇల్లు కూలిపోయిన వారికి ఈ పథకం వర్తించనున్నది. అలాగే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వెంటనే చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. లబ్ధిదారులకు రూ.3 లక్షలను మూడు దఫాలుగా లక్ష చొప్పున ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. అందుకోసం బడ్జెట్లో రూ.12వేల కోట్లను కేటాయించింది.
దాంతో పాటు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలను గుర్తించి, ఇండ్ల నిర్మాణాల కోసం దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని సీఎం నిర్ణయించారు.