కామేపల్లి, ఆగస్టు 14: రాష్ట్రంలో రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. రూ.31.58 లక్షల నిధులతో ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో కొండాయిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ నూతన కార్యాలయ భవనం, 300 టన్నుల గోదామును ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శమన్నారు. రాష్ట్రంలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నారని తెలిపారు. రైతులు సుభిక్షంగా ఉంటే దేశం, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కుతున్నదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియనాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.