హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది.. బాధ్యతగల పౌరులుగా తయారుచేసే గురువుల సేవలు వెలకట్టలేనివని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో గురువులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారి సర్వతోముఖాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అత్యధికంగా గురుకులాలు నెలకొల్పి విద్యావ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. తెలంగాణ విద్యను దేశానికి తలమానికంగా రూపుదిద్దే మహాయజ్ఞంలో ఉపాధ్యాయులందరూ సంపూర్ణ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన విద్యాలయాలు పునఃప్రారంభమైన నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఉపాధ్యాయులు బోధించాలని కోరారు.