హైదరాబాద్ : తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. పార్టీ సమావేశంలో నిర్ణయించిన అంశాలను కేసీఆర్ మీడియాకు వెల్లడించనున్నారు. యాసంగి ధాన్యం కొనేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కేంద్రంపై పోరుకు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం సాగాలన్నారు. కేంద్రం ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందన్నారు. కేంద్రం కశ్మీర్ ఫైల్స్‌ను పక్కనపెట్టి ప్రజా సమస్యలు పరిష్కరించాలని కేసీఆర్ సూచించారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్రావు కూడా హాజరయ్యారు.