హైదరాబాద్, ఆగస్టు10 (నమస్తే తెలంగాణ): సమీకృత జిల్లా కలెక్టరేట్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 7 సమీకృత జిల్లా కలెక్టరేట్లు ప్రారంభమయ్యాయి. మరో 8 కలెక్టరేట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఈ నెల 14న వికారాబాద్, 17న మేడ్చల్-మల్కాజిగిరి సమీకృత కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు మరింత చేరువైంది. మారుమూల గ్రామం నుంచి జిల్లా ప్రధాన కేంద్రం 70 కిలోమీటర్లలోపే ఉండేలా నూతన జిల్లాలను ఏర్పాటు చేశారు. జిల్లా పరిధి కూడా తగ్గడంతో కలెక్టర్లు ప్రతిగ్రామాన్ని పర్యవేక్షించే వీలు కలిగింది. జిల్లాస్థాయి అధికారులంతా ప్రజలకు ఒకేచోట అందుబాటులో ఉండేలా సీఎం కేసీఆర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించారు. ఆ మేరకు పలు జిల్లాల్లో కలెక్టరేట్ సముదాయాల నిర్మాణం పూర్తయ్యింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఏడు జిల్లా కలెక్టరేట్ సముదాయాల నుంచే ఆయా జిల్లాల పరిపాలన కొనసాగుతున్నది. సమీకృత జిల్లా కలెక్టరేట్లో విభాగాలన్నీ ఒకేదగ్గర కొలువుదీరి పనిచేస్తున్నాయి. అన్ని విభాగాల అధికారులందరూ ఒకేచోట ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పాయి.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిత్యం పర్యవేక్షిస్తూ సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా కృషి చేస్తున్నారు. 10 సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. వాటి నిర్మాణాలూ త్వరలో పూర్తికానున్నాయి. అయితే వివిధ కారణాల వల్ల మరో నాలుగు జిల్లాల సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు మొదలు కాలేదు. త్వరలో వాటి పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి(శంషాబాద్), భద్రాద్రి కొత్తగూడెం.
సిద్దిపేట, కామారెడ్డి, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, జనగామ, యాదాద్రి భువనగిరి, వనపర్తి.
కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, మెదక్, సూర్యాపేట.
ములుగు, నారాయణపేట, ఆదిలాబాద్, వరంగల్.