న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో రాజకీయ దుమారం తీవ్రమవుతున్న తరుణంలో జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఇస్లామాబాద్‌లోని ప్రభుత్వానికి 48 గంటల గడువు విధించింది. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే జూలై 9న “భారీ, తుది స్పందన” ఉంటుందని హెచ్చరించింది. జూలై 9న జరుగబోయే నిరసనలో పీవోకే వ్యాప్తంగా ఉన్న నివాసితులు, కశ్మీరీ ప్రవాసులు పాల్గొనాలని కమిటీ పిలుపునిచ్చింది.
పీవోకేలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను స్వయంగా పరిశీలించడానికి రావాలని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (వోఐసీ), అంతర్జాతీయ మీడియా సంస్థలను జేఏఏసీ అధికారికంగా అభ్యర్థించింది. పూంచ్, మీర్పూర్ డివిజన్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జూన్ 9 నాటి లాంగ్‌మార్చ్‌లో చూపిన పట్టుదలను మళ్లీ ప్రదర్శించాలని, తమ కుటుంబాలతో కలిసి మరోసారి పూంచ్ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కమిటీ కోరింది. పోలీసుల కాల్పులు జరిగినప్పటికీ రాష్ట్ర బలగాలను ఎదిరించి, నిర్బంధించిన తమ సోదరులను విడిపించుకొని ఇటీవల చరిత్ర సృష్టించిన మీర్పూర్ డివిజన్ మహిళల ధైర్యాన్ని కొనియాడింది.