హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీ గోల్ఫ్ ఫౌండేషన్ నిర్వహించిన 4వ ఎడిషన్ క్యాడీ క్లాష్ గోల్ఫ్ టోర్నమెంట్లో ప్రేమ్, మహమూద్ సత్తా చాటారు. గోల్ఫ్ ఆటలో కీలక పాత్ర పోషిస్తూ తెరవెనుక ఉంటున్న క్యాడీల ప్రతిభను గుర్తించేందుకు నిర్వహించిన ఈ ఈవెంట్లో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, బౌల్డర్ హిల్స్, బెప్టా , హల్దీ వంటి ప్రముఖ క్లబ్‌ల నుంచి 140 మందికి పైగా క్యాడీలు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. సోమవారం ముగిసిన టోర్నీలో బెప్టాకు చెందిన ప్రేమ్ (75 పాయింట్లు) గ్రాస్ విజేతగా , హెచ్జీఏకు చెందిన మహమూద్ రన్నరప్‌గా నిలిచారు. షా ఫైసల్, మేఘనాథ్ హ్యాండిక్యాప్ కేటగిరీల్లో టాప్ ప్లేస్ సొంతం చేసుకోగా.. క్లోజెస్ట్ టు ది పిన్ అవార్డును జి. మహేష్ సాధించాడు. విజేతలకు టిగోల్ఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి, ఎమార్ ఇండియా బిజినెస్ హెడ్ మధుసూదన్ రావు అవార్డులు అందించారు.