హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ‘వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లకు సీట్లివ్వరు. గజ్వేల్ నుంచి పోటీ చేయరు’.. అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొన్ని రోజులుగా పాడుతున్న పాట ఇది. దమ్ముంటే ఈ రెండూ చేయాలంటూ సవాల్ కూడా విసిరారు. వీరావేశంతో అప్పుడు సవాల్ చేసిన రేవంత్ ఇప్పుడు అభ్యర్థుల జాబితా ప్రకటనతో బొక్కబోర్లా పడ్డారు. గతంలో మాదిరిగానే మెజార్టీ స్థానాల్లో సిట్టింగ్‌లనే కేసీఆర్ మళ్లీ బరిలోకి దింపారు. తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేవంత్ సవాల్‌ను గుర్తు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. ఇప్పుడేమంటావని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా అడ్డగోలు ఆరోపణలు, సవాళ్లు చేయడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. వాస్తవానికి అనేక సర్వేల తర్వాతే కేసీఆర్ సిట్టింగ్‌లకు టికెట్లు ఖరారు చేశారు. విషయం తెలిసిన రేవంత్‌రెడ్డి సిట్టింగ్‌లకు టికెట్లు ఇస్తే మరోమారు ఓటమి తప్పదని భావించి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ టికెట్లు, సీఎం కేసీఆర్ పోటీపై పదే పదే తప్పుడు ప్రచారం చేశారని చెబుతున్నారు. కేసీఆర్ ప్రతిపక్షాల ఊహకు అందని విధంగా జాబితా ప్రకటించి షాకిచ్చారు. జాబితా చూసిన రేవంత్ ముఖం మాడిపోయిందని గాంధీభవన్‌లో గుసగుసలాడుకుంటున్నారు.