VRA regularization | హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): మొన్నటి వరకూ గ్రామ రెవెన్యూ సహాయకులుగా ఉన్నవారంతా సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలను తెలంగాణ సర్కారు క్రమబద్ధీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు సోమవారం రెవెన్యూశాఖ జీవో నంబర్ 81ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వులను సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వీఆర్ఏ జేఏసీ నేతలకు అందజేశారు. విద్యార్హతల ఆధారంగా వీఆర్ఏలకు ప్రభుత్వం మూడు క్యాటగిరీల్లో పేస్కేల్‌ను వర్తింపజేసింది. పదో తరగతి వరకు చదువుకొన్న వారికి లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (ఆఫీస్ సబార్డినేట్), ఇంటర్ చదివిన వారికి రికార్డ్ అసిస్టెంట్ లేదా సమానమైన, డిగ్రీ, ఆపై చదివిన వారికి జూనియర్ అసిస్టెంట్ లేదా సమానమైన పేస్కేల్ వర్తింపజేస్తున్నట్టు ఉత్తర్వుల్లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పేర్కొన్నారు.
ప్రస్తుతం 61 ఏండ్లలోపు వయసున్న 16,758 మందికి పేస్కేల్ వర్తించనున్నది. మరో 3,797 మంది వీఆర్ఏల వారసులకు కారు ణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 61 ఏండ్లు దాటినవారు, వైద్య కారణాల వల్ల ఉద్యోగాల్లో కొనసాగలేనివారు, 2014 జూన్ 2 తర్వాత విధుల్లో ఉండగా మరణించిన వీఆర్ఏల వారసులకు విద్యార్హతల ఆధారంగా మూడు క్యాటగిరీల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, వీఆర్ఏ జేఏసీ చైర్మన్ రాజయ్య, కో చైర్మన్ రమేశ్ బహదూర్, ప్రధా న కార్యదర్శి దాదేమియా, కో కన్వీనర్లు రఫీ, మాధవనాయుడు, వెంకటేశ్‌యాదవ్, వంగు రు రాములు, ఎన్ గోవింద్, ఉమా మహేశ్వర్, శిరీషారెడ్డి, సునీత, రాజు, వివిధ జిల్లాల చైర్మ న్లు అజీజ్, ఎడ్ల వెంకటేశ్, రవీందర్, నారాయణ, వెంకటేశ్, కొండ రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేయడం, వాటిని సీఎం కేసీఆర్ స్వయంగా తమకు అందించడం పట్ల వీఆర్ఏ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రుణం జీవితంలో తీర్చుకోలేమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20,555 కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపారని పేర్కొన్నారు. తరతరాలుగా నామమాత్రపు వేతనాలతో బతుకీడుస్తున్న తమకు పేస్కేల్ ద్వారా కొత్త జీవితాన్ని ప్రసాదించారని ఆనందం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ను జీవితాంతం గుండెల్లో పెట్టుకొని కొలుచుకుంటామని, ప్రతి ఒక్కరం ఇంట్లో సీఎం కేసీఆర్ ఫొటోను పెట్టుకొంటామని చెప్పారు. మంత్రి కేటీఆర్ జన్మదినం రోజే తమకు పేస్కేల్ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం మరింత సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘంలోని మంత్రులు కేటీఆర్, సత్యవతిరాథోడ్, జగదీశ్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తమకు మద్ధతుగా నిలిచిన మంత్రులు హరీశ్‌రావు, గం గుల కమలాకర్, ఇతర మంత్రులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు యాదవ్, ఎమ్మెల్యే బా ల్క సుమన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సచివాలయం వద్ద పటాకులు కాల్చి, సంబురాలు చేసుకొన్నారు. ‘సీఎం కేసీఆర్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.
పేస్కేల్ ప్రకటించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు సంబురాలు జరుపుకొన్నారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన అనంతరం వీఆర్ఏ జేఏసీ నేతలు సచివాలయం నుంచి 125 అడుగుల అంబేద్కర్ విగ్ర హం వరకు ర్యాలీగా వెళ్లారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కేక్ కట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో వీఆర్ఏలు సంబురాలు చేసుకొన్నారు. కుటుంబాలతో సహా తరలివచ్చి ప్రధాన కూడళ్లలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు.