సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1:05 గంటలకు యాదాద్రికి చేరుకొన్నారు. యాదాద్రిలో రూ.143.80 కోట్లతో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్‌ను సీఎం కేసీఆర్ గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. ప్రెసిడెన్షియల్ సూట్ అద్భుతంగా ఉన్నదని ప్రశంసించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి.. అక్కడి నుంచి 2:30 గంటలకు సమీకృత కలెక్టరేట్‌కు చేరుకొన్న సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టరేట్‌ను ప్రారంభించి కలెక్టర్ పమేలాసత్పతికి శుభాకాంక్షలు తెలిపారు. దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన యాదాద్రి క్షేత్రంలో వీవీఐపీలకు ఆతిథ్యమిచ్చేందుకు రూ.143.80 కోట్లతో ప్రెసిడెన్షియల్ సూట్‌ను నిర్మించారు. వీటిని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్ల విడిదికి మాత్రమే వినియోగించనున్నారు. కొండ దిగువన ఉత్తరాన 13.26 ఎకరాల చిన్న కొండపై ప్రెసిడెన్షియల్ సూట్, 14 విల్లాల నిర్మాణాన్ని దాతల ఆర్థిక సహకారంతో పూర్తి చేశారు. ప్రెసిడెన్షియల్ సూట్లో 6 బెడ్రూమ్లు, వెయింటింగ్ హాల్, డైనింగ్ హాల్, కిచెన్‌తోపాటు సేద తీరేందుకు సిట్ ఔట్ రూమ్‌లను సైతం ఏర్పాటు చేశారు. యాదాద్రీశుడిని దర్శించుకుని తిరిగి ప్రెసిడెన్షియల్ సూట్‌కు వచ్చేందుకు ప్రత్యేకమైన రోడ్లను నిర్మించారు.