
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రూపొందించిన రెవెన్యూ డైరీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. ట్రెసా ప్రతినిధులు మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి, డైరీని ఆవిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా డైరీలో రెవెన్యూ చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన విలువైన సమాచారం పొందుపరిచారని సీఎం అభినందించారు. రెవెన్యూ శాఖలో పదోన్నతులు, ఉద్యోగులకు స్పౌజ్, మ్యూచువల్ బదిలీలు, వీఆర్వోల సర్దుబాటు, వీఆర్ఏలకు పేసేల్, కంప్యూటర్ ఆపరేటర్ల క్రమబద్ధీకరణ వంటి పెండింగ్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్ కుమార్ తెలిపారు. వీటిపై ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. డైరీ ఆవిష్కరణలో మంత్రి హరీశ్‌రావు, ట్రెసా అసోసియేట్ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షుడు కే నిరంజన్ రావు, బాణాల రాంరెడ్డి, సంయుక్త కార్యదర్శి బీ శైలజ, కార్యవర్గ సభ్యుడు రమణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.