ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన
మార్చిలో నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై సమీక్ష
అధికారులకు దిశా నిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 6 /యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు యాదాద్రికి చేరుకొని బాలాలయంలో పూజలు నిర్వహించి, ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆలయ మహాకుంభ సంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గొంగిడిసునీతా మహేందర్‌రెడ్డిలతో కలిసి అధికారులతో చర్చిస్తారు. మార్చి 22 నుంచి 28వ తేదీ వరకు యాదాద్రి ఆలయ పున:ప్రారంభోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు, పీఠాధిపతులు, వీవీఐపీలు, సామాన్య భక్తుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయటంపై అధికారులకు దిశా నిర్దేశం చేస్తారు. సీఎం పర్యటనకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 12న సీఎం మరోసారి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పర్యటించి నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు.
చివరి దశకు చేరిన అభివృద్ధి పనులు
ఇప్పటికే ప్రధానాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. యాదాద్రి ఆలయం చుట్టూ చేపడుతున్న అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. గత అక్టోబర్ 19న సీఎం కేసీఆర్ యాదాద్రిని సందర్శించిన తర్వాత పనులు మరింత వేగం పుంజుకొన్నాయి. ఉత్తర దిశలో రూ.40 కోట్లతో చేపట్టిన రక్షణ గోడ, భారీ స్వాగత తోరణం, బస్బే నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొండపైన నిర్మించిన ప్రసాదాల సముదాయంలో యంత్రాలను బిగించి ట్రయల్ రన్ నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్‌ను మందిరంలా తీర్చిదిద్దే పనులు పూర్తి కావొస్తున్నాయి. పాత కనుమదారి విస్తరణ, పై వంతెన, కొత్త ఘాట్‌కు లింక్ చేసేందుకు కొండపై నుంచి కింది వరకు నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కొండ కింద గండి చెరువు, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణి, వ్రత మండపం, దీక్షాపరుల మండపం, అన్నప్రసాద భవనాలను నిర్మిస్తున్నారు. వీటిలో పుష్కరిణి, కల్యాణకట్ట, దీక్షాపరుల మండపం తుది మెరుగులు దిద్దుకొంటున్నాయి. గండి చెరువు సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. దేశ, విదేశీ ప్రముఖుల విడిది కోసం దాతల విరాళాలతో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. యాదాద్రి క్షేత్రం చుట్టూ రూ.143 కోట్లతో నిర్మిస్తున్న ఆరు వరుసల రహదారి పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. కొండ చుట్టూ, గిరి ప్రదక్షిణ దారి, వలయ రహదారి వెంట, ప్రధాన కూడళ్ల వద్ద రకరకాల పూల మొక్కలను ఏర్పాటు చేయడంతో ఆలయ పరిసరాలన్నీ పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.