మల్యాల, ఫిబ్రవరి 14 : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అభివృద్ధికి ఈ నెల 7న రూ.100 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. బుధవారం మాస్టర్ ప్లాన్‌కు రూపకల్పన చేసేందుకు స్వామివారి క్షేత్రానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు ప్రగతిభవన్ నుంచి రోడ్డుమార్గంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొంటారు. 9.10 గంటలకు హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 9.40 గంటలకు కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకొంటారు. అక్కడి నుంచి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొంటారు. అనంతరం కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించి జేఎన్టీయూకు బయలుదేరుతారు.
జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగుపయనమవుతారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ యాస్మిన్‌బాషా, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఏర్పాట్ల గురించి వివరించారు. అంతకుముందు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఆలయ ఆవరణలో ఏర్పాట్లను పరిశీలించారు.
తెలంగాణ తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం రాక
బీర్కూర్, ఫిబ్రవరి 14: కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామశివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 26 నుంచి మార్చి 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ ఈ బ్రహ్మోత్సవాలకు హాజరు కానున్నట్టు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.