హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాటేగావ్ తాలూకా కేంద్రంలో దళిత నేత అన్నా భావ్ సాఠే జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మహారాష్ట్ర యుగకవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావ్ సాఠే వాటేగావ్‌లోనే 1920, ఆగస్టు ఒకటో తేదీన జన్మించారు. డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ స్ఫూర్తితో దళిత ఉద్యమంలో చేరారు. అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన అనేక రచనలు చేశారు. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సాంగ్లీ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రముఖలతో కూడా సమావేశమవుతారు. అనంతరం కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. కొల్హాపూర్‌లోని దేవీ అంబాబాయి దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకొంటారు.
కేసీఆర్ పర్యటనను సక్సెస్ చేద్దాం: తులసీదాస్ మాంగ్
సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో తెలంగాణలోని మాంగ్ సమాజ్ ప్రజలు అధికసంఖ్యలో పాల్గొనాలని మాంగ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు గైక్వాడ్ తులసీదాస్ మాంగ్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో నిర్వహించే జయంతి వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. గ్రామాల్లో అన్నాభావ్ సాఠే జయంతి వేడుకలను ఘనంగా జరిపి, రాష్ట్రస్థాయిలో మాంగ్ సమాజ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించే జయంతి వేడుకలో భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.