హైదరాబాద్ : నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీపి కబురు అందించారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంబురాలు ఆకాశన్నాంటుతున్నాయి. కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.. ఒక్కొక్కటిగా సాకారం చేసుకుంటూ వెళ్తోంది. భారీ ప్రాజెక్టులతో ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించి తెలంగాణను సస్యశ్యామలం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ మానస పుత్రిక అయిన మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరును అందించారు. ప్రభుత్వానికి వివిధ మార్గాల్లో సమకూరుతున్న ఆదాయ వనరులను సబ్బండ వర్గాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. అంతే కాకుండా ఏడేండ్లలోనే అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచి, తలసరి ఆదాయంలో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇప్పటికే వివిధ శాఖల్లో లక్షకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం.. నేడు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేస్తున్నారు.